Telangana Congress :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసింది. ఓ రోజు పార్టీలో చేరే నేతల హడావుడి.. మరో రోజు స్ట్రాటజీ మీటింగ్ జరిగింది. ఈ రెండు సందర్భాల్లోనూ రాహుల్ గాంధీ మొత్తం పరిస్థితిని కంట్రోల్ చేశారు . ఎవరూ మీడియా ముందు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా  పార్టీ లైన్ దాటితే  ఉపేక్షించేది లేదన్నారు. ప్రత్యేకంగా ఇద్దరు నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లుగా చెపుతున్నారు.  దీంతో తెలంగాణ కాంగ్రెస్ సెట్ రైట్ అయినట్లేనా ?


పార్టీలోనే దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్, జగ్గారెడ్డి మీడియా ముందు ఆరోపణలు 


తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నిన్నటి వరకూ  మాజీ  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,  ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో పార్టీలో అంతర్గత విషయాలపై మాట్లాడారు.  ఎన్నికల స్ట్రాటజీ పై రాహుల్ తెంలగాణ నేతలతో సమావేశం అవడానికి ముందే వీరిద్దరూ మీడియాతో మాట్లాడారు. పార్టీలో తమపైన దుష్ప్రచారం చేస్తున్నారని..  రాహుల్ తోనే తాము తేల్చుకుంటామని  బయట ఉత్తమ్ రెడ్డి, జగ్గారెడ్డి  ప్రకటనలు చేసి వెళ్లారు.  లోపలికి వెళ్లిన తర్వాత వారు నోరు విప్పలేకపోయారు. దీనికి కారణం రాహుల్ గాంధీ కన్నెర్ర చేయడమే.  తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారు.. ఎవరు వేషాలేస్తున్నారో తనకు మొత్తం తెలుసని.. ఇద్దర్ని పార్టీ నుంచి పంపేస్తే మొత్తం సెట్ అవుతుందని రాహుల్  గట్టిగానే చెప్పారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.    రాహుల్ గాంధీ అదే సమయంలో .. ఎవరైనా పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడితే సహించేది లేదని.. నేరుగా బయటకు పంపడమేనని తేల్చి చెప్పారు. ఏదైనా సమస్యలుంటే పార్టీ దృష్టికి తేవాల్సిందేనని చెప్పారు. దీంతో సమావేశం ముగిసిన తర్వాత జగ్గారెడ్డి, ఉత్తమ్ మీడియా వైపు రాలేదు. తమను సంప్రదించిన మీడియా ప్రతినిధులకు పార్టీ ఆదేశాల ప్రకారం నడుస్తామని చెప్పారు. 


సీనియర్లు అంతా దారికి వచ్చినట్లేనా ? 


రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన తర్వాత వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది మాత్రం ఎక్కువగా జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే.  జగ్గారెడ్డి ఓ సందర్భంలో తాను ఇక కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని కాదని కూడా చెప్పుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరక వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇటీవల తనపై  కోవర్టు ముద్ర వేసి సొంత పార్టీ సోషల్ మీడియా నేతలే ప్రచారం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత .. యూత్ కాంగ్రెస్ వారిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చారు. తనపై యూత్ కాంగ్రెస్ వాళ్లు దుష్ప్రచారం  చేయడం వెనుక పార్టీ పెద్దలున్నారని సరైన సమయంలో బయటపెడతానని ప్రకటించారు. అలాంటి ప్రకటనలు రాహుల్ తో సమవేశం ముందు కూడా చెప్పారు.కానీ రాహుల్ ముందు చెప్పలేకపోయారు. ఇప్పుడు రాహుల్ హెచ్చరికలతో అందరూ దారికి వచ్చినట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. 


కాంగ్రెస్ గాలి ఉందని నమ్ముతున్నారా ?


కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు ఏర్పడిన సానుకూల వాతావరణం.. డీకే శివకుమార్, ప్రియాంకా గాంధీ  బాధ్యతలు తీసుకోవడంతో ఎలాగైనా గెలిపించి పెడతారన్న నమ్మకానికి నేతలు వస్తున్నారు.   తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఎక్కువగా ఉందని.. ఎప్పుడూ కేసీఆరేనా ఈ సారి కాంగ్రెస్ లకు చాన్సిద్దామన్న ఆలోచన ప్రజల్లో పెరుగుతోందని నమ్ముతున్నారు.  అందుకే మిగిలిన రెబల్ లీడర్స్ అంతా సైలెంట్ అయిపోతున్నారని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది.  రాజకీయాల్లో ఏదైనా గెలుపు ఆశలే పార్టని నిలబెడతాయి. ఇంత కాలం కాంగ్రెస్ కు చాన్స్ లేదని అనుకున్నారు .అందుకే ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అయింది. కానీ ఇప్పుడు  పరిస్థితి మారడం తో సర్దుకుపోతున్నారని అంటున్నారు. 









Join Us on Telegram: https://t.me/abpdesamofficial