YSRCP :  ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీకి ఏమీ కలసి రావడం లేదు. తాజాగా మంగళగిరి నుంచి పోటీ చేసిన అభ్యర్థి మురుగుడు లావణ్య మామ , మాజీ ఎమ్మెల్యే,  ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైసీపీకి గుడ్ బై చెప్పే అవకాశం కనిిస్తోంది. మంగళగిరిలో జరిగిన ఓ కల్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారా లోకష్ తో పాటు ఆయన కూడా పాల్గొన్నారు. అదే వేదిక మీద నుంచి చంద్రబాబుపై ప్రశంసల  వర్షం కురిపించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబుకు పద్మశాలి కుల వృత్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు వీవర్సకు జిఎస్టి లేకుండా కేంద్రంతో మాట్లాడి తీసేస్తామని హామీ ఇచ్చారన్నారు.  చేనేతలకు మగ్గాలు లేని వారికి సొంత ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీకి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ అంశం మంగళగిరిలో చర్చనీయాంశంగా మారింది . టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకునే ఆయన ఇలా మాట్లాడుతున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. 


లోకేష్‌పై పోటీ చేసి ఓడిపోయిన మురుగుడు హనుమంతరావు కోడలు 


మురుగుడు హనుమంతరావు  మొదట్లో కాంగ్రెస్ పార్టీ లో ఉండేవారు. ఆయన 1999, 2004లో  కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి 2009లో ఆయనకు టిక్కెట్ దక్కలేదు కానీ  ఆయన వియ్యంకురాలు కాండ్రు కమలకు  కాంగ్రెస్ టిక్కెట్ దక్కింది. ఆమె కూడా విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లింది.  వైసీపీలో చేరినా మురుగుడు హనుమంతరావుకు టిక్కెట్ దక్కలేదు. వైసీపీ తరపున రెండు సార్లు ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. మురుగుడు హనుమంతరావు మధ్యలో ఓ సారి టీడీపీలో చేరి .. టీడీపీ ఓడిపోయిన తర్వాత మళ్లీ వైసీపీలో చేరారు.               


భారీ ఓటమితో టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం


వైసీపీ అధినేత జగన్ మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ ఇచ్చారు. చేనేతవర్గం నుంచి అభ్యర్థిని లోకేష్‌పై పోటీకి పెట్టాలని డిసైడ్ కావడంతో మురుగుడు హనుమంతరావుతో పాటు కాండ్రుకమల కూడా టిక్కెట్ కోసం గట్టి ప్రయత్నం చేశారు. కానీ టీడీపీ నుంచి ఓ సారి ఎన్నికల్లో పోటీ చేసిన గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకున్న జగన్ ఆయనకే టిక్కెట్ ఇవ్వాలనుకున్నారు. కానీ లోకేష్ ను ఎదుర్కోలేకపోతున్నారని చివరి క్షణంలో మురుగుడు హనుమంతరావు కోడలు, కాండ్రు కమల కుమార్తె అయిన లావణ్యకు టిక్కెట్ ఇచ్చారు. అయితే ఆమె కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయారు. 90వేలకుపైగా ఓట్ల తేడాతో  ఓడిపోయారు.                       


ఎన్నికలు ముగిసిన తర్వాత వైసీపీ కీలక నేత ఇంట్లో పెద్ద ఎత్తువ మద్యం నిల్వలు బయటపడ్డాయి. ఈ మద్యం నిల్వలు మురుగుడు లావణ్య తండ్రివేనని పోలీసులు తేల్చారు. దీంతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వారు వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించారు. ఇప్పుడు నేరుగా చంద్రబాబును పొగడటంతో  వారు పార్టీ మారుతారన్న ప్రచారం ప్రారంభమయింది.