Srikakulam News: ఉత్తరాంధ్రలో వైసీపీ వైభవం కొట్టుకుపోతోంది. రానురానూ పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. ఐదేళ్లపాటు ఎదురులేని దర్జా వెలగబెట్టిన పార్టీ, ఇప్పుడు దిక్కులు చూస్తోంది. వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్‌మెంబర్ అభ్యర్థి ఎటు చూసినా గిర్రున తిరుగుతూ కనిపించిన ఫ్యాన్‌ పవర్ కట్ అయ్యి కుదేలైపోయింది. కనిపించిందంతా బలమే అనుకుని మురిసిపోయింది. కానీ అదంతా వాపు అని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది.

 

ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం. 2014లోనూ వైసీపీ ఓటమిపాలైంది. అయితే ఆనాడు పార్టీ నాయకుల్లోగానీ, కార్యకర్తల్లో గానీ, జగన్ అభిమానుల్లో గానీ ఎక్కడా ఇంత నీరసం చూడలేదు. ఓటమి వచ్చినా, ఐదేళ్లపాటు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. క్షేత్రస్థాయిలో నిజమైన ప్రతిపక్షం అనిపించారు. ఈసారి ఓటమితో దానికి పూర్తిగా భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. అప్పుడు జగన్మోహన రెడ్డి అనే వ్యక్తి గురించి ఎవరికీ ఏమీ తెలియదు. బోలెడన్ని ఆశలు భ్రమలు ఉండేవి కాబోలు అని విశ్లేషకులు చెబుతుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌పై ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు. జనాలకే కాదు సొంత పార్టీ నేతలకి కూడా వాస్తవం తెలిసి వచ్చిందని అంటున్నారు. 

 

ఇలా పార్టీకి దూరంగా ఉంటున్న వారిలో ఉత్తరాంధ్ర నేతలు మొదటి స్థానంలో ఉన్నారు. ఉత్తరాంధ్రలో 2014లో 9 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున గెలిస్తే ఈసారి ఆ సంఖ్య రెండుకు పడిపోయింది. అదీ ఏజెన్సీలోని పాడేరు, అరకు సీట్లే. మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 32 సెగ్మెంట్‌లలో భారీ ఓటమి ఎదుర్కొంది. సోషల్ ఇంజినీరింగ్ పేరుతో ఎక్కడెక్కడి నుంచో అభ్యర్థులను తీసుకొచ్చి ఎన్నికల్లో పోటీ చేయించారు. ఓడిపోయిన తర్వాత వాళ్లంతా సొంత ప్రాంతాలకు వెళ్లిపోవడంతో చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ఇన్‌ఛార్జ్‌లు లేని పరిస్థితి ఉంది. 

 

ఉమ్మడి శ్రీకాకుళం 

శ్రీకాకుళం జిల్లాను పరిశీలిస్తే పాతపట్నంలో రెడ్డి శాంతి ఓటమి అందరూ ఊహించిందే. ముందు నుంచి ఆమెపై వ్యతిరేకత ఉంది. పాతపట్నంలో వైసీపీ నాయకులెవరూ ఆమెను ఇన్చార్జ్ అంగీకరించడం లేదు. కొత్తవారిని పెట్టాలని కోరుతున్నారు. 

 

ఆముదాలవలస

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నప్పటికీ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే బాగుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ రెబల్‌గా పోటీ చేసిన గాంధీ, చింతాడ రవికుమార్‌లో ఒకరికి బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఉంది. 

 

టెక్కలి

టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ తప్ప జగన్‌కు మరో నేత కనిపించలేదు. కింజరాపు కుటుంబాన్నే టార్గెట్ చేసిన ఈయనకు ఓటమి తప్పలేదు. ఇక్కడ పేరాడ తిలక్‌ను నియమిస్తే పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని కేడర్ అభిప్రాయం.

 

శ్రీకాకుళం

శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ధర్మాన ప్రసాదరావు రిటైర్మెంట్ మూడ్‌లో ఉన్నారు. కుమారుడు రామ్‌మనోహర్ నాయుడు పొలిటికల్ కెరీర్ నిర్మించే పనిలో పడ్డారు. వైసీపీలో ఉండే ఆలోచనే లేదని తెలుస్తోంది. దీంతో ఇక్కడ కూడా పార్టీ కొత్త వారికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందనే మాట వినిపిస్తోంది.

 

ఎచ్చెర్ల

ఎచ్చెర్లలో ముందు నుంచి మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్ మీద తీవ్ర అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తే బీజేపీని గెలిపించింది. కిరణ్‌ను తప్పిస్తే తప్ప అక్కడ  పార్టీ బాగుపడే సూచన కనిపించడం లేదంటున్నారు నేతలు. 

 

పాలకొండ

మాజీ ఎమ్మెల్యే కళావతి స్థానంలో మార్పు అవసరం అని క్యాడర్ చెబుతోంది.కొత్త నీరు వస్తేనే పార్టీ బతుకుతుందని వారి ఆలోచన.

 

రాజాం

రాజాంలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులను మార్చి రాజేష్‌కు అవకాశం ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నారో కనిపించడం లేదని కేడర్ ఫిర్యాదు చేస్తోంది. ఇక్కడకూడా గట్టి నాయకుడ్ని నియమించాలని సూచిస్తున్నారు. .

 

నరసన్నపేట

నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ చురుకుగానే ఉన్నారు. కానీ కేడర్ మార్పు కోరుతోంది. మొన్నటి ఎన్నికల్లో సెకెండ్ క్యాడర్ టీడీపీకి వెళ్లిపోయింది. సో.. ఇక్కడ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు కోరుతున్నారు. 

 

పలాస

పలాసలో డా.సీదిరి అప్పలరాజు బలమైన నాయకుడు. ఆయన నాయకత్వంలో పార్టీ యాక్టివ్‌గానే ఉంది. నిరాశాజనక వాతావరణంలోనూ పార్టీ చురుకుగా పనిచేస్తోందని అంటున్నారు. ఆయనపై నియోజకవర్గం లీడర్లు కూడా సానుకూలంగానే ఉన్నారు. 

 

ఇచ్చాపురం


ఇచ్చాపురం నుంచి పోటీ చేసిన పిరియా విజయ ఓటమితో డీలా పడిపోయారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు కొంత హడావిడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. విజయ ఓటమి ఆయనకు కలిసి వచ్చిందంటున్నారు కేడర్. ఆయనకు ఈసారి ఇన్‌ఛార్జ్ పదవి లభిస్తుందనే అంచనాల్లో ఉన్నారు. అందుకే ఆయన చురుగ్గా ఉన్నారని టాక్.