Reservations will be made for BC, SC and ST in AP liquor shops : ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ పాలసీ మారబోతోంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీ అమల్లోకి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పుడున్న విధానానికి పూర్తి స్థాయిలో మార్పు ఉండబోతోంది. ఇప్పుడు ప్రభుత్వమే దుకాణాలు అద్దెకు తీసుకుని సిబ్బందిని నియమించుకుని.. సొంతంగా అమ్మకాలు చేస్తోంది.ఈ క్రమంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా చంద్రబాబు కూడా సీఐడీ విచారణకు ఆదేశించారు. అందుకే పాలసీలో మార్పు ఖాయమయింది. అధికారులు ఇతర రాష్ట్రాల్లో విధానాలను పరిశీలిస్తున్నారు. అయితే కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పడంతో.. దుకాణాల వేలం పాట ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మద్యం పాలసీలోనే రిజర్వేషన్లు
మద్యం దుకాణాల కేటాయింపుల్లో కొన్ని సామాజిక తరగతులకు రిజర్వేషన్ కల్పించాలని చంద్రబాబు త్వరలో ప్రకటించనున్న నూతన మద్యం పాలసీలో ఈ మేరకు ప్రతిపాదించనున్నారు. సంప్రదాయంగా కల్లుగీత వృత్తిలో ఉంటున్న వారు గతంలో మద్యం దుకాణాల నిర్వహణలో ఎక్కువగా ఉండేవారు. అయితే మధ్యలో బడా వ్యాపారులు చొరబడటంతో వారి ప్రాధాన్యం తగ్గిపోయింది. గత ప్రభుత్వం పాలసీని మార్చేయడంతో ఎవరికీ అవకాశం రాలేదు. ఈ సారి గౌడ, ఈడిగలకు ప్రాధాన్యత ఇచ్చేలా మద్యం దుకాణాల కేటాయింపుల్లో రిజర్వేషన్ విధానాన్ని అమలుచేయాలని చంద్రబాబు నిర్ణయించారు. సోమవారం జరిగిన కలెక్టర్‌ల రాష్ట్రస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఈ దిశలో కొన్ని సూచనలు చేశారు. గౌడ, ఈడిగ సామాజిక తరగతులవారు సాంప్రదాయంగా కల్లు విక్రయాలు చేస్తారని, వారికి మద్యం షాపుల్లో 15 నుంచి 20 శాతం షాపులను కేటాయించే అంశంపై ఆలోచన చేయాలని ఆయన సూచించారు.
అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - జగన్‌కు మరిన్ని కష్టాలు తప్పవా ?
మద్యం దుకాణాల్లో రిజర్వేషన్ విధానం తెచ్చిన కేసీఆర్
గత ఎన్నికలకు ముందు మద్యం దుకాణాల వేలం పాటను నిర్వహించిన కేసీఆర్ ప్రభుత్వం ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేసింది. తెలంగాణా ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వ ఏ- 4 రిటైల్ షాపుల లైసెన్సులను 2021 -23 సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గౌడ్‌లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు 5 శాతం కేటాయించారు. ఆ నిబంధనల ప్రకారమే .. జిల్లాల వారీగా రిజర్వేషన్లు అమలు చేశారు. లాటరీ తీసి దుకాణాలను ఆయా సామాజికవర్గాల వారీగా కేటాయించారు. ఆ ప్రకారం వేలం నిర్వహించారు. ఈ కారణంగా ఆయా వర్గాల నుంచి కొంత మంది మద్యం దుకాణాలు దక్కించుకోగలిగారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీపై మొదలైన కసరత్తు- కొత్త ఫార్ములాతో పదవుల సర్ధుబాటు
పని ప్రారంభించిన అధికారిక కమిటీలు
నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకు ఇచ్చేలా ఆరు రాష్ట్రాల్లో మద్యం విధానాన్ని అద్యయనం చేసేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటు చేసింది. ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, కేరళ, తమిళనాడు, తెలంగాణా, కర్నాటక రాష్ట్రాల్లో ఆయా కమిటీలు అద్యయనాన్ని ప్రారంభించింది. ఆ కమిటీలు ఈ నెల 12 తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి. ఆ నివేదిక ఆదారంగా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించనుంది. ఇక ప్రభుత్వ రంగంలో ఎంత మాత్రం దుకాణాలు సాగే అవకాశం లేదు. వేలం పాట నిర్వహించడం ఖాయమని అనుకోవచ్చు. ఈ దిశగా అధికారులు ఇచ్చే నివేదికలను ఆమోదించిన తర్వాత .. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు. గౌడ, ఈడిగ కులాలకే కేటాయిస్తారా లేకపోతే ఎస్సీ , ఎస్టీలకూ కేటాయిస్తారా అన్నది అప్పుడు తేలే అవకాశం ఉంది.