KCR National Politics :  దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి పెరుగుతోంది. రాజకీయ పార్టీలన్నీ జోరుగా సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే ఈ సారి తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. దేశంలో తిరుగులేని నేతగా ఉన్న నరేంద్రమోదీని ఎదుర్కొనేందుకు శక్తియుక్తులు కేంద్రీకరించుకుంటున్నారు. చాలా కాలం పాటు ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించారు కానీ సాధ్యం కాలేదు. దాంతో ఆయన జాతీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఆ పార్టీతో ఇతర పార్టీల్ని కలుపుకోవాలనుకుంటున్నారు. అందుకోసం చాలా మంది నేతల్ని కలిశారు. కలుస్తూనే ఉన్నారు. తీరా యుద్ధ సమయం దగ్గరకు వచ్చే సరికి ఎవరికి వారు చెల్లాచెదురైపోతున్నారు. కాంగ్రెస్‌తో కలుస్తానని నితీష్ అంటూంటే.. మోదీ చాలా మంచి వారని మమతా బెనర్జీ అంటున్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు కేసీఆర్ వైపు పడింది. 


కేసీఆర్‌కు అనూహ్యమైన షాక్ ఇచ్చిన నితీష్ కుమార్ !


భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పి .. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్. ఆ తర్వాత వెంటనే తెలంగాణ సీఎం సీఏం కేసీఆర్ బీహార్ వెళ్లి నితీష్ కుమార్‌ను కలిశారు. బీజేపీని గద్దె దించడానికి కలిసి పని చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ పోరాట తత్వాన్ని ఆయన ప్రశంసించారు. కేసీఆర్  జాతీయ పార్టీ పెట్టినా.. జాతీయ కూటమి పెట్టినా నితీష్ కలిసి వస్తారని అనుకున్నారు. కానీ ఆయన హఠాత్తుగా ఢిల్లీలో సీరియస్ ప్రకటన చేశారు. త్వరలో రాహుల్, సోనియాలను కలుస్తానని ప్రకటించారు. వారితో కలిసి పని చేసేందుకు సిద్ధమంటున్నారు. అంటే నితీష్ కుమార్ .. మూడో కూటమి లేదా కేసీఆర్ ప్రతిపాదించబోయే జాతీయ వేదిక వంటి వాటిపై ఆయన ఆసక్తిగా లేనట్లే. కాంగ్రెస్ కూటమిలోనే చేరే అవకాశం ఉంది.  యూపీఏ కూటమి అధికారంలోకి వస్తే మన్మోహన్ తరహాలో తనకు ప్రధాని పదవి చాన్స్ ఉంటుందని ఆయన ఆశిస్తూ ఉండవచ్చని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.


మోదీపై దూకుడు తగ్గించేసిన దీదీ !


ప్రధాని మోదీపై  తీవ్ర స్థాయిలో విరుచుకుపడే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా  ప్రత్యామ్నాయ నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. ఇటీవల బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలు కావొచ్చు.. కేంద్ర దర్యాప్తు  సంస్థల దూకుడు కావొచ్చు కానీ ఆమె జాతీయ రాజకీయాల గురించి మాట్లాడం మానేశారు. గవర్నర్‌గా ఉంటూ తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ధన్‌ఖడ్‌కు పరోక్షంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సహకరించారు కూడా. ఇప్పుడు ప్రధాని మోదీ చాలా మంచి వారని.. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వెనుక ఆయన హస్తం లేదని సర్టిఫికెట్ ఇస్తున్నారు. కారణం ఏదైనా .. ప్రస్తుతం మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితుల్లో లేరు. వచ్చే ఎన్నికల్లో కూడా  పరిస్థితులు అనుకూలంగా ఉండవని స్పష్టం కావడంతో ఆమె ఇలా సైలెంట్ అయ్యారని చెబుతున్నారు . దీంతో కేసీఆర్‌తో కలిసి మోదీకి వ్యతిరేకంగా ఆమె కలసి వచ్చే అవకాశాలు లేవు. 


జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరేనా !?


ఇప్పటికిప్పుడు బీజేపీపై యుద్ధానికి కేసీఆర్‌తో కలిసి వచ్చే వారు దాదాపుగా లేరు. యూపీలో అఖిలేష్ యాదవ్ ప్రస్తుతం తాను తన రాష్ట్రంలో ఎక్కువ సీట్లను గెల్చుకోవడంపైనే  దృష్టి పెట్టారు. ఆ తర్వాతే ఇతర విషయాలు ఆలోచిస్తానంటున్నారు. స్టాలిన్ కాంగ్రెస్ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ..బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క అడుగు కాదు కదా ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇక  ఒరిస్సా సీఎం పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలకు దూరం. ఇటీవల కేసీఆర్‌ను కలిసిన  కర్ణాటక నేత కుమారస్వామి రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఓ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకపోతే.. మొత్తానికే నష్టపోయే సూచనలు ఆ  పార్టీకి ఉన్నాయి. దీంతో ఏదో ఓ కూటమిలో చేరిపోతారు. ఇక గుజరాత్ నుంచి వచ్చి కలిసిన శంకర్ సింగ్ వాఘేలా రాజకీయంగా ఎలాంటి ప్రభావమూ చూపే పరిస్థితిలో లేరు. 


త్వరలో ఢిల్లీకి కేసీఆర్ - నిర్ణయం తీసుకుంటారా ?


కేసీఆర్ జాతీయ రాజకీయ ఆలోచనలు ఎప్పుడూ కలిసి రావడం లేదు. ఇప్పుడు కూడా అంతే. అందరూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కానీ కేసీఆర్ ముందుకే వెళ్లాలనుకుంటున్నారు. ఏం  చేయాలన్నది దసరాలోపే ప్రకటించే అవకాశం ఉంది. అందుకే ఆయన రెండు, మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లవచ్చని చెబుతున్నారు. ఓ వైపు కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు పెరగడం.. మరో వైపు జాతీయ రాజకీయాల పరంగా ఏదీ కలసి రాకపోవడం కేసీఆర్‌కు సవాళ్లుగా మారాయి.