Name Politics : అంచనాలకు భిన్నంగా సంచలనాలు సృష్టించడం జగన్ స్టైల్. ఎవరూ ఊహించని విధంగా అప్పట్లో మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం దగ్గర్నుంచి తాజాగా రాత్రికి రాత్రి ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శటీగా మార్చే వరకూ ఈ ఒరవడి కొనసాగుతూనే ఉంది. అయితే ఆ నిర్ణయాల వెనుక ఓ రాజకీయం ఉంటుంది. అదేమటనేది స్పష్టంగా ఎవరికీ తెలియదు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాల వారినీ ఆకట్టుకోవాలని జగన్ అనుకుని ఉండవచ్చు..మరి హఠాత్తుగా ఎన్టీఆర్ పేరును తీసేసి ఆయన ఏం సాధించాలనుకున్నారు? చాలా మందికి ఇదే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ నిర్ణయంలో ఎంత వెదుక్కున్నా రాజకీయ విశ్లేషకులకు ప్లస్ పాయింట్లు కనిపించడం లేదు మరి.
ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల కొత్తగా ఓటు బ్యాంక్ కలసి వస్తుందా!?
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమానించే వారంతా ఇప్పుడు జగన్ ను అభిమానిస్తున్నారు. జగన్ అభిమానులు ఎవరూ ఇతర పార్టీలకు ఓటు బ్యాంక్‌గా ఉండే అవకాశం లేదు. వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ హార్డ్ కోర్ సపోర్టర్లు. అందులో డౌట్ లేదు. కొత్తగా వైఎస్ఆర్‌ను ఆకాశానికెత్తడం వల్ల ఎలాంటి ఓటు బ్యాంక్ ద్గగరకు రాదు. కానీ సీఎం జగన్ రాత్రికి రాత్రి ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్ఆర్ పేరు మీదకు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. ఉదయం అమలు చేసేశారు. ఆయనకు తిరుగులేని మెజార్టీ ఉంది. అనుకున్నట్లే చేయగలరు.. చేశారు. కానీ ఇందులో అసలు రాజకీయ లాభం ఏమిటనేది వైఎస్ఆర్‌సీపీ నేతలకూ అర్థం కావడం లేదు.
హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమా? పకడ్బందీ వ్యూహమా ?
ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు అనే అంశం గత మూడున్నరేళ్లలో ఎప్పుడూ చర్చకు రాలేదు. సీఎం జగన్ అలాంటి ఆలోచన చేస్తున్నారని ఎవరూ అనుకోలేదు. చివరికి సెప్టెంబర్ 20 మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకూ ఎవరికీ తెలియదు. కానీ ఆ తర్వాత మాత్రం.. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును మార్చాలని కేబినెట్ నిర్ణయించిందన్న సమాచారం బయటకు వచ్చింది. ఆన్ లైన్‌లోనే అంగీకారం తీసుకున్నారని.. అసెంబ్లీలో బిల్లు పెడతారని ఆ సారాంశం. ఇంత వేగంగా పని పూర్తి చేశారంటే హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమైనా అయి ఉండాలి లేదా.. పకడ్బందీ వ్యూహం ప్రకారం బయటకు పొక్కకుండా పని పూర్తి చేశారనైనా అనుకోవాలి. అయితే ఇలా చేసినా అసలు మోటో ఏమిటన్నది మాత్రం క్లారిటీ లేదు.
సొంత పార్టీలోనూ బయటపడిన అసంతృప్తి !
కారణం ఏదైనా కావొచ్చు కానీ వైఎస్ఆర్‌సీపీలో కొంత మంది కరుడుగట్టిన తెలుగుదేశం నేతలు ఉన్నారు. వారు తెలుగుదేశానికి దూరమయ్యారు. కానీ ఎన్టీఆర్‌ను దైవంగా చెబుతూ ఉంటారు. వారిలో అసంతృప్తి బయటపడింది. అధికార భాషా సంఘం పదవికి యార్లగడ్డ లక్ష్మిప్రసాద్ రాజీనామా చేసేశారు. తెలుగు మీడయాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన ప్రభుత్వాన్ని సమర్థించారు. వల్లభనేని వంశీ మరోసారి నిర్ణయాన్ని పరశీలించాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. కొడాలి నాని, లక్ష్మి పార్వతి లాంటి నేతుల స్పందించడానికి తటపటాయిస్తున్నారు. సోషల్ మీడియాలో కరుడు గట్టిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు కొందరు.. ఇది మంచి నిర్ణయం కాదని నిర్మోహమాటంగానే చెబుతున్నారు. ఈ మాత్రం స్పందన వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఊహించి ఉండదని అనుకోలేం.
డైవర్షన్ రాజకీయం అని బలమైన అభిప్రాయం !
గత మూడున్నరేళ్లే వైఎస్ఆర్‌సీపీ రాజకీయ వ్యూహాలను చూస్తే.. ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి రాజకీయ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని రాజకీయవర్గాలు గుర్తు చేస్తున్నాయి. అలాంటిదేదో డైవర్షన్ కోసమే చేసి ఉంటారని దాదాపుగా అన్ని పార్టీల నేతలూ చెబుతున్నారు. కానీ అదేమిటన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి ఏదైనా ఇబ్బందికరమైన అంశం వెలుగులోకి రాబోతోందా అనే చర్చ కూడా జరుగుతోంది.
మొత్తంగా ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు అనేది చాలా సీరియస్ అంశం. ఇది భవిష్యత్ రాజకీయాల్లోనూ కీలకం అవుతుంది. ఆ విషయం రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిపోయిన జగన్‌కు తెలియనిదేం కాదు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించిన బలమైన అంశం ఏమిటన్నది మాత్రం రాజకీయవర్గాలు అంతుబట్టడం లేదు.