State Leaders National Stunts :   ప్రాంతీయ పార్టీల నేతలు దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాలనుకుంటున్నారు. అందితే ప్రధానమంత్రి పదవినీ పట్టుకోవాలనుకుంటున్నారు. సంకీర్ణ రాజకీయ శకంలో ఇది సాధ్యమే అనిపించినా ఇప్పుడు మాత్రం అలాంటి అవకాశాలు ఉన్నాయని ఎవరూ అనుకోవడం లేదు. కానీ రాజకీయ నేతలకు మాత్రం అసాధ్యమైనదేదీ లేదు అని గట్టిగా నమ్ముతారు. అందుకే తమ వంతు ప్రయత్నాలు సీరియస్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది నేతలు తామంటే తాము మోదీకి పోటీ అని తెరపైకి వస్తున్నారు. గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. 


మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు ? 


తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ దేశ ప్రధాని అవుతారా? బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమికి నాయకురాలు అవుతారా?  అరవింద్‌ కేజ్రీవాల్‌ దేశ్ కీ నేతగా మారతారా ?   నితీష్‌ కుమారే మోదీకి సరైన ప్రత్యర్థా ?  శరద్‌ పవార్‌కు ఆ అవకాశం దక్కుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే కేసీఆర్ తానే మోదీకి ప్రత్యామ్నాయం అన్నంతగా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా దేశ్ కీ నేత అని ప్రచారం చేసుకుంటున్నారు.  బీజేపీ వ్యతిరేక నేతలందర్నీ కలిసేందుకు ఆయన వెనక్కి తగ్గడం లేదు. అయితే ఏ ఒక్క నేత కూడా ఆయనను ప్రాంతీయ పార్టీల కూటమి నేతగా లేదా.. మోదీకి ధఈటైన ప్రతిపక్షాల అభ్యర్థిగా మాత్రం అంగీకరించడం లేదు... అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. 


మమతా బెనర్జీ నుంచి కేజ్రీవాల్ వరకూ అందరిదీ అదే లక్ష్యం ! 
 
ప్రాంతీయ పార్టీల నేతలు చాలామందికి జాతీయ నాయకత్వం , ప్రధాని పదవి గురించిన ఆశలు వ్యూహాలు ఉన్నాయి. వీరికి  అలాంటి ఆశలు కలగడానికి దేశంలో సంకీర్ణశకం నడిచిప్పటి కాలం అని చెప్పవచ్చు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌ వంటి వారు అతి  స్వల్ప సీట్లతో ప్రధానులు అయ్యారు. అయితే అప్పుడు జనతాదళ్‌ జాతీయ పార్టీగా వుండటం, వందకు పైగా స్థానాలు గల కాంగ్రెస్‌ వామపక్షాలు బలపర్చడం వల్లనే అది సాధ్యపడింది. హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, జ్యోతిబాసు, వి.పి.సింగ్‌ వంటి హేమాహేమీలు  అప్పట్లో ఉన్నారు. ఇప్పుడా పరిస్థితులు లేదవు.  తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్  ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు.   ప్రాంతీయ పార్టీల నేతలకు ప్రధానమంత్రి పదవిపై ఆశ ఉంది.   ఇప్పటికిప్పుడు తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే స్థితిలో విపక్షాలు లేవు. 


మోదీని ఓడించడం కన్నా... ఓడిస్తే వచ్చే పదవిపైనే ప్రాంతీయ పార్టీల నేతలు ఆశలు !


గతంలో ఎప్పుడైనా ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే కేంద్రంలో ఏ సంఘటనలు, కూటములైనా ఏర్పడ్డాయి. అయితే ఇప్పుడు మాత్రం  ఎవరి కోణంలో కూటముల గురించీ, వాటి నాయకత్వాల గురించీ మాట్లాడుతున్నారు. ప్రయత్నిస్తున్నారు.  బిజెపి బలం పెరగడం, కాంగ్రెస్‌ బాగా బలహీనపడటం, ప్రాంతీయ పార్టీలకు మరింత ప్రాధాన్యత కొత్త పరిణామాలు కావడాన్ని ప్రాంతీయ పార్టీలు ఆహ్వానించలేకపోతున్నాయి.    ప్రజలు ఇవేమీ పట్టించుకోకుండా… ప్రధాని అభ్యర్థితో సంబంధం లేకుండా.. యూపీఏకి అధికారం ఇచ్చారు. యూపీఏ తరపున మన్మోహన్ ప్రధాని అయ్యారు. ఎప్పటికప్పుడు నాయకులు పుట్టుకు వస్తూనే ఉన్నారు. నాయకులు చరిత్రను సృష్టించరు. చరిత్ర నాయకుల్ని సృష్టిస్తుంది. బీజేపీయేతర పక్షాలకు.. ప్రధానమంత్రి అభ్యర్థి లేరు. కానీ తామే కావాలని పట్టుబట్టే నేతలకు కొదవ లేదు. 


జాతీయ ఆశకు పోయి హోంగ్రౌండ్‌లో బలహీనం అయిన  ప్రాంతీయ పార్టీల నేతలు !


తమ పార్టీ గట్టిగా యభై లోక్‌సభ సీట్లలో పోటీ చేసే స్థాయి లేకపోయినప్పటికీ ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకోవడం నేడు ప్రాంతీయ పార్టీల నైజం. అది చాలా వరకూ వారిని నిర్వీర్యం చేస్తోంది. మాయవతి ఇప్పుడుపూర్తిగా రాజకీయ పట్టును కోల్పోయారు. ములాయం సింగ్ యాదవ్ రిటైరైపోయారు. చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని మొదటికే మోసం తెచ్చుకున్నారు. ఇప్పుడా జాబితాలో కేసీఆర్ కూడా చేరవచ్చని చెబుతున్నారు. 


ముందు మోదీని ఓడిస్తే తర్వాత నాయకత్వ సమస్యపై చర్చ ! 


భారత దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఎంపీలు ఎన్నికవుతూంటారు. ప్రధానమంత్రి అభ్యర్థిని బట్టి కాదు. గత ఎన్నికల్లో చూసుకుంటే.. దక్షిణాదితో పాటు.. బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా మోదీ మానియాను చూసి ఎవరూ ఓటేయలేదు. వచ్చే ఎన్నికలు కూడా అంతే. ఎ  ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిస్తే.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకొస్తారు. ప్రాంతీయ పార్టీలన్నీ అత్యధిక స్థానాలు గెలిస్తే.. వారి నుంచే ఓ ప్రధానమంత్రి వస్తారు. అంటే…ప్రజల తీర్పు నుంచే ప్రధాని వస్తారు.. తప్ప ప్రధానే ప్రజల తీర్పును నిర్ణయించరు. ఈ విషయాన్ని ప్రాంతీయ పార్టీల నేతలు గుర్తించలేకపోతున్నారు.