Telangana Early Elections :  తెలంగాణలో మళ్లీ ముందస్తు ఎన్నికలపై చర్చ ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ ఉపఎన్నికలు ఎదుర్కోవడం.. ఆ తర్వాత మరిన్ని రాజకీయ పరిమాణాలు.. ఫిరాయింపులు.. షిండేలు ఇలాంటి తలనొప్పి అంతా ఎందుకని నేరుగా ఎన్నికలు ఎదుర్కొంటే బెటరని ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో టీఆర్ఎస్‌కు ఇప్పుడు మెరుగైన పరిస్థితి ఉందని అనేక సర్వేలు చెబుతున్నాయి. బీజేపీకి బలడేందుకు మరింత సమయం ఇవ్వకుండా ఇప్పుడే  ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను కేసీఆర్ సీరియస్‌గా పరిశీలిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


మునుగోడు ఉపఎన్నికనా ? ముందస్తు ఎన్నికలా ?


తెలంగాణలో సెమీఫైనల్‌గా ప్రచారం పొందుతున్న మునుగోడు ఉపఎన్నిక  జరగాల్సి ఉంది. ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల కావొచ్చు. ఇది సాదాసీదా ఉపఎన్నిక కాదని అందరూ భావిస్తున్నారు. మునుగోడులో వచ్చే ఫలితం రాజకీయం మారుస్తుంది.  అక్కడ  పొరబాటున బీజేపీ లేదా కాంగ్రెస్ గెలిస్తే రాజకీయం ఆయా పార్టీలకు అనుకూలంగా మారుతుంది.  బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు ఉంటాయి. మైండ్ గేమ్ ప్రారంభమవుతుంది. చాలా తీవ్రమైన గడ్డు పరిస్థితులు కేసీఆర్ ఎదుర్కోవాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీలో చేరేందుకు సీనియర్ నేతలు క్యూ కడతారని భావిస్తున్నారు. అదే  టీఆర్ఎస్ గెలిస్తే  ఆ పార్టీకి పాజిటివ్ వేవ్ వస్తుంది. కానీ ఇది బీజేపీ గెలిస్తే ఆ పార్టీకి వచ్చేంత ఊపు రాదు. ఎదుకంటే టీఆర్ఎస్ ఇప్పటికే రెండు విడతలుగా అధికారంలో ఉంది. 


ముందస్తు వల్ల బీజేపీకి బలపడే చాన్స్ ఇవ్వకుండే వ్యూహం ! 


ముందస్తుగా వెళ్లడం వల్ల సవాల్‌గా మారే రాజకీయ పరిణామాలను కేసీఆర్ కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బీజేపీ లాంగ్ టార్గెట్ పెట్టుకుని ఎన్నికల వ్యూహం అమలు చేస్తోంది. అందుకే ఉపఎన్నికలకు ప్లాన్ చేసింది. బీజేపీలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమైన అభ్యర్థులు లేరు. మెజార్టీ నియోజకవర్గాల్లో వలసలపైనే ఆధారపడాల్సి ఉంది. అదే మునుగోడు ఉపఎన్నిక తర్వాత ఆ లోటు తీరిపోతుందన్న అంచనా ఉంది. బీజేపీ పూర్తి స్థాయిలో సిద్ధం కానందున ఇప్పుడే ఎన్నికలకు వెళ్తే..  ఆ పార్టీ ఎదుర్కోవడం సులభమని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే ఉంది. ఆ పార్టీకి సరైన సమయంలో ఎన్నికలు పెట్టినా అంతర్గత కుమ్ములాటలు తప్పవు. 


కానీ ప్రజలు వ్యతిరేకంగా స్పందిస్తే మొదటికే మోసం !


కేసీఆర్ గతంలో ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లారు. ఆరు నెలలు అనేది పెద్ద సమయం కాదని.. అది ముందస్తు కాదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. అందుకే ఆ విషయం పెద్దగా ప్రజల్లో చర్చనీయాంశం కాలేదు. కానీ ఇప్పుడు ఏడాదికిపైగా సమయం ఉంది. ఇప్పుడు ముందస్తుకు వెళ్తే.. రాజకీయ ప్రయోజనాల కోసమే వెళ్లారన్న చర్చ జరుగుతుంది. అది ప్రజల్లో వ్యతిరేక ప్రచారానికి కారణం అవుతుంది. ఈ విషయంలో ప్రజలు తీవ్రంగా స్పందిస్తే అధికార వ్యతిరేకత పెరుగుతుంది. కానీ కేసీఆర్ ముందస్తు ఆలోచన ఉంటే.. ఇప్పటికే ఈ ప్రచారానికి ఎలా కళ్లేం వేయాలో ప్లాన్ కూడా రెడీ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. 


పూర్తవుతున్న జిల్లాల పర్యటనలు - అభ్యర్థులపై కసరత్తూ ఓ కొలిక్కి !


కేసీఆర్ జిల్లాల పర్యటనలు దాదాపుగా పూర్తవుతున్నాయి. అదే్ సమయంలో పీకే టీం గ్రామాల్లో కూడా సర్వే చేస్తోంది. పీకే టీం ఎప్పటికప్పుడు అందిస్తున్న ఇన్‌పుట్‌తో కేసీఆర్ రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. అభ్యర్థులపైనా కేసీఆర్ కసరత్తు పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు . చాలా నియోజకవర్గాల్లో మార్చాలనుకున్న అభ్యర్థులకు.. కొత్త వారికి సంకేతాలు వెళ్లాయి. ఇవి కూడా కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారన్న సంకేతాలు అందడానికి కారణం అవుతోంది. ఏం నిర్ణయం తీసుకోబోతున్నారో మూడో తేదీన స్పష్టమయ్యే అవకాశం ఉంది.