Janasena joinings :  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోతున్నాయి.  తెలంగాణలో ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటం, ఓ ఉపఎన్నిక కూడా ముంగిటకు రావడంతో అన్ని  పార్టీలు సెమీ ఫైనల్స్ రాజకీయాలు చేస్తున్నాయి. ఏపీలో అలాంటి సెమీ ఫైనల్స్ ఏమీ లేకపోయినా రాజకీయ పార్టీలు మాత్రం ఫైనల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్‌ను తీవ్రంగా చేస్తున్నాయి. కలసి వచ్చే నేతల్ని కలుపుకుని బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో తనదైన ముద్ర వేయాలని తాపత్రయపడుతోంది. ఆ పార్టీలో క్రమంగా చేరికలు పెరుగుతున్నాయి. ఇతర పార్టీల నుంచి కీలక నేతలు వచ్చి చేరుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ చేరికలు ఎక్కువగా ఉన్నాయి. 


జనసేనలో చేరుతున్న నియోజకవర్గ స్థాయి నాయకులు ! 


ఇటీవలి కాలంలో జనసేనలో జరుగుతున్న చేరికలు పెరిగాయి. గుడివాడలో కొడాలి నాని ముఖ్య అనుచరులుగా పేరు పడిన పాలంకి బ్రదర్స్ జనసేనలో చేరారు.  వారు కొడాలి నానిపై పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.  వారు సొంత రాజకీయం చేస్తున్నారు. తాజాగా రాజోలు నియోజకవర్గం నుంచి గత రెండు సార్లు వైఎస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు కూడా జనసేనలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఆయన రహస్యంగా పవన్ కల్యాణ్‌ను కలిశారు. అయితే రాజోలులో ఇప్పటికే జనసేన తరపున టిక్కెట్ కోసం మాజీ ఐఏఎస్ ఒకరికి పవన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన నియోజవకర్గంలో పని చేసుకుంటున్నారు. బొంతు రాజశ్వేరరావు రాజోలు కాకపోతే మరో చట అయినా పోటీ చేయడానికి అవకాశం ఇస్తే జనసేలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  ఇటీవల గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివరామిరెడ్డి అనే వైసీపీ నేత కూడా జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో రోజూ ఇలాంటి చేరికలు ఉన్నాయి. సోమవారం  పార్వతీపురం, పెదకూరపాడు నుంచి కొంత మంది నేతలు వచ్చి చేరారు. 


వైఎస్ఆర్‌సీపీ నుంచే జనసేనలోకి వలసలు !


జనసేన పార్టీలో చేరుతున్న వారిలో అత్యధికం వైఎస్ఆర్‌సీపీ  నేతలే.  పాలంకి బ్రదర్స్ సహా శివరామిరెడ్డి, బొంతు రాజేశ్వరరావు వంటి వారు వైఎస్ఆర్‌సీపీలో కీలకంగా పని చేసిన వారే. టిక్కెట్ గ్యారంటీ ఉంటే.. చాలా మంది  జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన పార్టీకి నాయకుల కొరత ఉంది. పవన్ కల్యాణ్‌ ఇమేజ్‌ను ఉపయోగించుకుని సొంత బలం తోడు చేసుకుని విజయం సాధించగల అభ్యర్థుల కోసం ఆ పార్టీ ఎదురు చూస్తోంది. వైఎస్ఆర్‌సీపీలో నేతలు ఓవర్ లోడ్ అయ్యారు. చాలా మందికి రాజకీయంగానూ గుర్తింపు లభించడం లేదు. ఏ గుర్తింపు లేని చోట ఉండటం కన్నా.. జనసేన లాంటి పార్టీలో చేరితే కీలకంగా పని చేస్తే మంచి  గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. అందుకే ఆ పార్టీ వైపు ఎక్కువ మంది చూస్తున్నారని భావిస్తున్నారు. 


టీడీపీతో పొత్తు ఉండి సీటు దక్కితే జాక్ పాట్ కొట్టినట్లేనన్న భావన ! 


ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తుల చర్చలు కూడా నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీని ఓడించడానికి ఓట్లు చీలకుండా చేస్తామని జనసేన అధినేత పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్న చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ కారణంగా కొంత మంది నేతలు..జనసేన పార్టీలో చేరాలనే ఆసక్తి చూపిస్తున్నారు. టీడీపీ - జనసేన కలిస్తే చాలా నియోజకవర్గాల్లో ఏకపక్ష పోరు ఉంటుందని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగా జనసేన పార్టీకి పొత్తులో భాగంగా వచ్చే సీట్లలో పోటీకి అవకాశం దక్కించుకుంటే తిరుగుండదని కొంత మంది నమ్ముతున్నారు. వారు జనసేన పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా పలువురు నేతలు చర్చలు జరుపుతున్నారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.  


చేరికలు ఏ పార్టీకైనా కొత్త ఉత్సాహాన్నిస్తాయి. భవిష్యత్ ఉంటుందనే నమ్మకంతోనే పార్టీలో చేరుతారు. ఎంత ఎక్కువగా చేరికలు ఉంటే అంత నమ్మకం ఉంటుందని భావిస్తారు. ఇప్పుడు అలాంటి నమ్మకం జనసేనలో కనిపిస్తోంది.