Lagadapati : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లగడపాటి రాజగోపాల్ ది ప్రత్యేకమైన స్థానం. రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రెండు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. గత కొద్ది కాలం నుంచి మళ్లీ ఆయన రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన ఖండించారు. మళ్లీ ఆయన అనుచరులు విజయవాడలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. లగడపాటిని రాజకీయాల్లోకి ఆహ్వానించాలని అనుకుంటున్నారు.అయితే ఆయనకు తెలియకుండా అనుచరులు సమావేశం అవుతారా అన్న చర్చ నడుస్తోంది.
అన్ని ప్రధాన పార్టీలకు విజయవాడ అభ్యర్థి సమస్య
ఏపీలో టీడీపీ, వైసీపీలకు విజయవాడ అభ్యర్థి సమస్య ఉంది. టీడీపీలో సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. వైసీపీకి అసలు అభ్యర్థే లేరు. ఇప్పటి వరకూ ఎవరి పేరూ ప్రచారంలోకి రాలేదు. లగడపాటి అయితే తిరుగులేని అభ్యర్థి అవుతారన్న అభిప్రాయం ఉంది. ఆయన అనుచరులు లగడపాటి కూడా మళ్లీ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. చాలా కాలంగా ఢిల్లీకే పరిమితమైన ఆయన అప్పుడప్పుడూ ఏపీకి వస్తున్నారు. ఆయన కూడా మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
ఆహ్వానం పంపిన బీజేపీ
భారతీయ జనతా పార్టీలో చేరాలని ఆయనకు ఆ పార్టీ నుంచి ఆహ్వానం వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గడపాటికి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీలో చేరిన అతి కొద్దిరోజుల్లోనే కిరణ్ రెడ్డికి మంచి ప్రాధాన్యత ఇచ్చింది అధిష్టానం. కమలం గూటికి చేరితే బాగుంటుందని కిరణ్ స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం. కానీ లగడ పాటి ఏ నిర్ణయం తీసుకోలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కూడా లగడపాటికి మంచి పరిచయాలున్నాయి.
చేరితో టీడీపీ నుంచి టిక్కెట్ ఖాయం
చంద్రబాబుకు లగడపాటికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని సార్లు లగడపాటి టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశంలో లేనని లగడపాటి ప్రకటించారు. ఇప్పుడు మనసు మార్చుకునే ప్రయత్నం లో ఉండటంతో టీడీపీ నుంచి మళ్లీ ఆహ్వానాలు వెళ్లి ఉంటాయని భావిస్తున్నాయి. లగడపాటి అంగీకరించాలే కానీ వైసీపీ కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. అనుచరులందరూ కలిసి త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆత్మీయ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
రాజకీయంగా లగడపాటికి ఓటమి ఎరుగని రికార్డు
కాంగ్రెస్ తరఫున లగడపాటి 2004, 2009 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీచేసి గెలిచారు. 2004లో టీడీపీ అభ్యర్థి, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌పై లక్ష ఓట్ల మెజార్టీతో 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీపై 12 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆంధ్రా అక్టోపస్ గా పేరున్న ఆయన సర్వేలు చేయడంలో ఆరితేరిపోయారు. గత ఎన్నికలకు ముందు చేసిన ఫలితాలు తేడా కొట్టడంతో ఇక సర్వేలు చేయనని ప్రకటించారు.
అయితే గంతలోనూ లగడపాటి రాజకీయ ఎంట్రీపై ప్రచారాలు జరిగాయి. కానీ ఎప్పటికప్పుడు ఆయన ఖండించారు. ఈ సారి కూడా ఖండిస్తే.. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని అనుకోవచ్చు. మౌనంగా ఉన్నా.. పాజిటివ్ గా స్పందించినా... మరో బిగ్ లీడర్ ఏపీ రాజకీయాల్లో హంగామా చేయడానికి రెడీ అయినట్లే.