T TDP :  తెలంగాణ తెలుగుదేశం పార్టీతో అనుబంధం తెంచుకుంట కంటతడి పెట్టుకుంటున్నారు నేతలు. ఇంత కాలం తెలంగాణలో టీడీపీకి భవిష్యత్ ఉంటుందని ఆశిస్తూ పార్టీలో కొనసాగిన వారు కూడా గుడ్ బై చెబుతున్నారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తోందని ... టీడీపీతో తమకు ఉన్న అనుబంధం గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. తాజాగా..  తెలుగుదేశం సీనియర్‌ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి దంపతులు టీడీపీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. తెలంగాణలో ఎన్నికల వేడి పెరుగుతూండటంతో ఏదో ఓ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. 


ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీ సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి 


ఉమ్మడి ఏపీలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీయాల్లో వీరు కీలకంగా వ్యవహరించారు. దయాకర్‌రెడ్డి అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్‌ నుంచి గెలుపొందారు.  సీతా దయాకర్ రెడ్డి  2002లో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో  భార్యభర్తలిద్దరూ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. 2018 ముందస్తు ఎన్నికల్లో మహా కూటమిలో భాగంగా మక్తల్ నుంచి పోటీ చేసినా .. కాంగ్రెస్ తరపున రెబల్ పోటీలో ఉండటంతో గెలవలేకపోయారు. 


కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారెటు ? సోనియా చెబితే తమ్ముడ్ని ఓడిస్తారా ?


టీ టీడీపీ నుంచి ఎంత మంది వెళ్లిపోయినా పార్టీని అంటి పెట్టుకుని ఉన్న దయాకర్ రెడ్డి 


తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా టీడీపీలోనే ఉన్నారు. పరిస్థితులు మారిపోయినా... పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా టీడీపీని వీడినా వారు మాత్రం పార్టీని అంటి పెట్టుకునే ఉన్నారు.  ఇటీవ  మక్తల్ , దేవరకద్ర నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తే గెలవడం కష్టమని నిర్ణయానికి వచ్చారు. రెండు నియోజకవర్గాల్లో దయాకర్ రెడ్డి దంపతులకు మంచి పట్టు ఉండటంతో   మూడు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. 


బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ


ఇప్పుడు పార్టీ మారాలని నిర్ణయం - టీడీపీతో అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి


దేవరకద్రలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో టీడీపీని వీడుతున్న విషయం వెల్లడిస్తూ దయాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. టీడీపీతో 30 ఏళ్ల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మూడు నెలల పాటు దేవరకద్ర, మక్తల్‌ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటామని కొత్తకోట దంపతులు చెప్పారు. కాంగ్రెస్, బీజేపీతోపాటు టీఆర్ఎస్ నేతలు కూడా వారిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.   మూడు నెలల తర్వాత కొత్తకోట దంపతులు నిర్ణయం తీసుకోనున్నారు.