Amit Shah : తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు డైనమిక్‌గా మారుతున్నాయి. మునుగోడులో ఉపఎన్నిక ఖాయం కావడంతో బీజేపీ విజయం సాధించేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. 21వ తేదీన ఆయన మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించబోతున్న భారీ బహిరంగసభలో పాల్గొనేందుకు వస్తున్నారు. ఆ సభలోనే రాజగోపాల్ రెడ్డి తో పాటు అనేక మంది ఇతర పార్టీల నేతలు కండువా కప్పుకోనున్నారు. నిన్న మొన్నటి వరకూ అమిత్ షా టూర్ ఉంటుందా ఉండదా అన్న చర్చ జరిగింది. కానీ ఇప్పుడు షెడ్యూల్ కూడా వచ్చేసింది. అందులో అనూహ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీ టూర్ కూడా ఉండటం రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది.
తెలంగాణలో అమిత్ షా షెడ్యూల్
1) ఈనెల 21న మధ్యాహ్నం 3:40 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అమిత్ షా
2) శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో సాయంత్రం 4:25 కు మునుగోడుకు పయనం
3) నాలుగు 35 నుంచి 4:50 వరకు సిఆర్పిఎఫ్ అధికారులతో రివ్యూ
4) సాయంత్రం 4:50 గంటల నుంచి 6 గంటల వరకు మునుగోడు సభలో హోం మంత్రి అమిత్ షా
5) అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకొనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
6) సాయంత్రం మునుగోడు నుంచి హెలికాప్టర్లో 6:25 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా
7) 6:45 నుంచి 7:30 వరకు రామోజీ ఫిలిం సిటీ లో అమిత్ షా
8) అనంతరం శంషాబాద్ నోవా టెల్ కు అమిత్ షా
9) నోవా టెల్ లో ముఖ్య నేతలతో సమావేశం
10) రాత్రి 9:40కి ఢిల్లీకి తిరుగు ప్రయాణం
45 నిమిషాల పాటు ఫిల్మ్ సిటీలో ఉండనున్న అమిత్ షా
హోంమంత్రి అమిత్ షాది బిజీ షెడ్యూల్ మధ్యాహ్నం మూడున్నర సమయంలో హైదరాబాద్‌లో అడుగు పెడితే.. రాత్రి తొమ్మిదిన్నరలోపే కీలక సమావేశాల్లో పాల్గొనాల్సి ఉంది . ఇలాంటి టైట్ షెడ్యూల్‌లోనూ నలభై ఐదు నిమిషాల పాటు ఫిల్మ్ సిటీలో గడపనున్నారు అమిత్ షా. అయితే అమిత్ షా ఫిల్మ్ సిటీకి విశ్రాంతి కోసం వెళ్తున్నారా లేకపోతే మరేదైనా రాజకీయ కారణం ఉందా అన్నదానిపై స్పష్టత లేదు. రామోజీ ఫిల్మ్ సిటీలోనే రామోజీరావు నివాసం ఉంటారు. గతంలో హైదరాబాద్‌కు వచ్చిన సందర్భాల్లో అమిత్ షా రామోజీరావును కలిశారు. ఈ సారి కూడా ఆయనతో భేటీ కోసం ఫిల్మ్ సిటీకి వెళ్తున్నట్లుగా చెబుతున్నారు.
మీడియా మద్దతు కోసం అమిత్ షా ప్రయత్నాలా ?
గతంలో ఓ సారి మీడియా ప్రముఖులందర్నీ కలిసిన రామోజీరావు మద్దతు కోరారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ వస్తున్నందున.. అదీ కూడా ఫిల్మ్ సిటీకి చేరువగానే బహిరంగసభలో పాల్గొంటున్నందున మరోసారి రామోజీరావుతో చర్చలు జరుపుతారని అంటున్నారు. మీడియా మద్దతు కోసం అమిత్ షా ప్రయత్నిస్తున్నట్లు గా భావిస్తున్నారు.