What Next Komatireddy : తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం రాను రాను పీట ముడి పడుతోంది. నల్లగొండ జిల్లా సీనియర్ నేతగా మునుగోడు ఉపఎన్నిక బాధ్యత ఆయన తీసుకోవాల్సి ఉంది. కానీ అక్కడ సోదరుడు రాజగోపాల్ రెడ్డినే బీజేపీ తరపున పోటీ చేస్తూండటం ఇప్పుడు వెంకటరెడ్డికి ఇబ్బందికరంగా మారింది. ఆయన కూడా బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. కానీ కాంగ్రెస్ అంటే తాను.. తానంటే కాంగ్రెస్ అని ఆయన చెబుతున్నారు. అయితే రేవంత్ రెడ్డిని కారణంగా చూపిస్తూ తాను మునుగోడు బాధ్యతలు తీసుకోనని చెబుతున్నారు.త అయితే రేవంత్ రెడ్డి ఆయన అడిగినట్లుగా క్షమాపణలు చెప్పారు. అయినా కోమటిరెడ్డి తగ్గలేదు. సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ అడిగినట్లుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్‌కు దూరం జరుగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ముందు నుంచీ పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడిన వెంకటరెడ్డి .. అది రేవంత్ రెడ్డికి లభించడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. తర్వాత సర్దుకున్నారు. కానీ సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన సోదరుడిని పల్లెత్తు మాట అనడం లేదు కానీ పీసీసీ చీఫ్‌ను మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. తనను బయటకు గెంటేయడానికి ప్రయత్నిస్తున్నారని.. రాహుల్, సోనియా వద్దే తేల్చుకుంటానని చెబుతున్నారు. మునుగోడులో తాను ప్రచారం చేయబోనని.. తనను ఎవరూ పిలవలేదని అంటున్నారు. అయితే తాజాగా ఆయన వ్యక్తిగతంగా మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో పర్యటించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు చూస్తున్న రాజగోపాల్ రెడ్డి అనుచరులే ఉన్నారు దీంతో కాంగ్రెస్ పార్టీలో ఆయనపై అసహనం కనిపిస్తోంది.
వెంకటరెడ్డికి సపోర్టుగా సీనియర్లు
అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. మాజీ ఎంపీ వీహెచ్ .. మునుగోడు బాధ్యతలను కోమటిరెడ్డికే అప్పగించాలని అంటున్నారు. కోమటిరెడ్డికి నల్లగొండ జిల్లాలో మంచి పట్టు ఉందని.. మునుగోడులో ఆయనకే బాధ్యతలిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి తెస్తారని అంటున్నారు. నిజానికి గతంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగినప్పుడు.. ఉపఎన్నిక వస్తే అభ్యర్థికి కోమటిరెడ్డి వెంకటరెడ్డినే ఖరారు చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత వెంకటరెడ్డి పూర్తిగా సైడ్ కావడంతో ఈ చర్చ ముందుకు సాగలేదు.
సోనియా చెబితే తమ్ముడ్ని ఓడిస్తారా ?
సోనియా అపాయింట్‌మెంట్‌ను అడిగినట్లుగా కోమటిరెడ్డి వర్గీయులు చెబుతున్నారు. ఈ ప్రకారం.. సోనియా సమయం ఇస్తే ఆయన వెళ్లి కలిసే అవకాశం ఉంది. పార్టీ అధినేతగా సోనియా.. మునుగోడులో పార్టీని గెలిపించమనే సూచిస్తారు. స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చినందున యాక్టివ్ పార్ట్ తీసుకోవాలని కోరుతారు. మరి వెంకటరెడ్డి తన అసంతృప్తిని తొలగించుకుని రంగంలోకి దిగుతారా ? పార్టీని గెలిపిస్తారా ? తమ్ముడ్ని ఓడిస్తారా ? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది