వనమా రాఘవ ఉదంతంతో కొత్తగూడెం రాజకీయాలు రోజురోజుకూ మారిపోతున్నాయి. నియోజకవర్గంపై పట్టుకోసం నాయకులు తమదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. 2018 ఎన్నికల్లో ఓటమి అనంతరం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న జలగం వెంకటరావు మరోమారు కొత్తగూడెంపై దృష్టి సారించారు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌కు పరిమితమైన ఆయన కొత్తగూడెంకు రావడం, క్యాంప్‌ కార్యాలయంలో ఉండటంతో ఇప్పుడు నియోజకవర్గంలో రాజకీయంగా చర్చ సాగుతుంది.


2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాదించిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. దీంతో అప్పటి వరకు టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న జలగం వెంకటరావు వర్గానికి వనమా వర్గానికి మద్య విబేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటరావు నియోజకవర్గానికి ఎక్కువగా రాకపోవడం, హైదరాబాద్‌కు పరిమితం అవుతుండటంతో అప్పటి వరకు జలగం వర్గంగా ఉన్న కార్యకర్తలు, నాయకులు వనమా వర్గానికి చేరారు. దీంతో వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరించాడు


రాఘవ ఉదంతంతో మారిన రాజకీయం..
నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యలో రాఘవ ప్రమేయం ఉండటం, ఆ తర్వాత రాఘవ అరాచకాలపై నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో అప్పటి వరకు వనమా వెంట నాయకులు, కార్యకర్తలు సైతం తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. కొందరు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వద్దకు వెళ్లగా మరికొందరు ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు వద్దకు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు స్తబ్థుగా ఉన్న జలగం వెంకటరావు అనూహ్యంగా కొత్తగూడెంకు రావడం, క్యాంప్‌ కార్యాలయంలో ఉండటంతో ఇప్పుడు రాజకీయం వేడెక్కింది. మరోవైపు వెన్నుముక శస్త్ర చికిత్స చేయించుకుని మూడు నెలలుగా హైదరాబాద్‌లో ఉన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సైతం కొత్తగూడెం చేరుకోవడం, కార్యకర్తలతో ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించి కార్యకర్తలు వేరే గూటికి చేరకుండా ఉండేందుకు తంటాలు పడుతున్నారు.


జలగం అభిమానులు తిరిగి వస్తారా..?
2018 తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తలోదారి చూసుకున్న జలగం వర్గీయులు తిరిగి ఆయన చెంతకు వస్తారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చ సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే వెంకటరావు హైదరాబాద్‌కు పరిమితం కావడంతో ఎవరి దారి వారు చూసుకున్న కార్యకర్తలు ఆయన రాకతో తిరిగి ఆయన వద్దకు చేరుతారా..? లేదా..? అనేది చర్చ జరుగుతుంది. 2014 ఎన్నికల్లో విజయం సాదించిన జలగం వెంకటరావు ఆ తర్వాత నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదిగారు. 2018 తర్వాత పరిణామాలు, ఆయన నియోజకవర్గానికి రాకపోవడంతో కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. అయితే ఇప్పటి వరకు కేవలం కార్యకర్తలకు ఫోన్‌లోనే టచ్‌లో ఉంటున్న జలగం వెంకటరావు ఇప్పుడు కొత్తగూడెం చేరుకోవడంతో ఆయన ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారనేది చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ప్రస్తుతం కొత్తగూడెం రాజకీయాలు మాత్రం రసవత్తరంగా కొనసాగుతున్నాయి.