ఎమ్మెల్యే బాలకృష్ణ తనదైన రాజకీయ ఎత్తుగడలతో అధికార పార్టీని డిఫెన్స్ లో పడేశారు. నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నాం అంటూనే హిందూపురానికి అన్యాయం చేశారని అఖిలపక్షనేతలతో కలిసి చేసిన పోరాటం....రాజీనామా అస్త్రం అధికారపార్టీని కలవరపెడుతోంది. పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై అన్ స్టాపబుల్ పోరాటం చేస్తానని ప్రకటించారు. దీంతో అధికార పార్టీ నేతలపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు.  ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా రాజీనామా బాట పట్టారు. బాలకృష్ణతో పాటు తాను కూడా రాజీనామాకు సిద్ధం అంటూ ప్రకటించాల్సిన పరిస్థితిని బాలయ్య తీసుకొచ్చారు. దీంతో రెండురోజుల బాలయ్య పర్యటనలో జిల్లా కేంద్రం కోసం చేయాల్సిన పోరాటంలో కచ్చితంగా అధికారపార్టీపై విజయం సాధించారని చెప్పవచ్చు. జిల్లా నేతలు, అఖిలపక్ష నేతలతో కలెక్టర్ ను కలిసి తమ ప్రాంత ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీంతో ఇఫ్పటికే ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని కలెక్టర్ కు అందజేశారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం పుట్టపర్తి కేంద్రంగా ఉంచేందుకు సిద్ధం అయినట్టు తెలుస్తోంది.


కొత్త జిల్లాలపై కేవలం నెలరోజుల వ్యవధిని కంటితుడుపు చర్యగానే చూస్తున్నారు. ప్రభుత్వం కావాలనే ఒక నెలరోజుల గడువు ఇచ్చిందని, దాదాపుగా జిల్లా కేంద్రాల విషయంలో చివరి నిర్ణయం అయిపోయినట్టు అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. హిందూపురం ఎప్పుడు టీడీపీ నియోజకవర్గం కావడం, కర్ణాటక సరిహద్దుకు అత్యంత దగ్గరగా ఉన్న నేపథ్యంలో అక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం కంటే పుట్టపర్తి అయితే అన్ని ప్రాంతాలకు సెంటర్ గా ఉంటుందన్న అభిప్రాయంతోనే జిల్లా కేంద్రంగా ప్రకటించినట్టు నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ఎక్కడైతే బాగుంటుందన్న కోణంలో అధికారులు, నేతలు స్థలాల పరిశీలనకు అంతర్గతంగా చర్యలు తీసుకొంటున్నారు. నెల రోజుల తరువాత నూతన జిల్లాల కార్యక్రమం వేగవంతం అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా ఈ మేరకు చర్యలు తీసుకొంటున్నారు. అయితే బాలయ్య మాత్రం జిల్లా కేంద్రం విషయంలోనే అభ్యంతరం ఉందని, సత్యసాయి జిల్లాగా ప్రకటించడంలో మాత్రం అభ్యంతరం లేదంటున్నారు. హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.


ఈ విషయంలో టీడీపీ కౌన్సెలర్లుతో కలిసి రాజీనామాలకు కూడా సిద్దం అని, అన్ స్టాపబుల్ రాజకీయం చేస్తానని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రకటించారు. దీంతో అసలే హిందూపురంలో అంతంత మాత్రం ఉన్న అధికార పార్టీ కూడా రాజీనామా బాటనే అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండురోజుల బాలయ్య పర్యటన విజయవంతంగా ముగిసిందనే చెప్పవచ్చు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా కూడా కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ఆయన మీద గౌరవంతో ఏర్పాటు చేయలేదని అన్నారు. అదే గౌరవం ఉంటే ఎందుకు ఆయన విగ్రహాలను ధ్వంసం చేస్తారు....ఎందుకు అన్న క్యాంటీన్లు తొలగిస్తారని అని బాలయ్య ప్రశ్నించారు. ఇలా రెండురోజుల పర్యటనలో అధికార పార్టీ కేవలం ఉద్యోగుల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు అర్థరాత్రి హడావిడిగా నూతన జిల్లాల జీవోలను తెచ్చి రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు బాలయ్య.