ప్రధానమంత్రి నరేంద్రమోడీ చాలా కాలం తర్వాత తెలంగాణ పర్యటనకు వచ్చారు. ఆయనది అధికారిక కార్యక్రమం. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నారు. ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరించారు. అటు కేసీఆర్‌కు స్వాగతం పలకడానికే కాదు ఇటు కార్యక్రమాల్లోనూ కేసీఆర్ పాల్గొనలేదు. ఇది చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఇది ఓ రకమైన నిరసన అని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం రాజకీయమని అంటున్నారు. సీఎంవో వర్గాలు మాత్రం కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని మీడియాకు సమాచారం ఇచ్చాయి. ఇంతకూ ఏది నిజం ?
శుక్రవారమే తలసానికి ప్రోటోకాల్ బాధ్యతలు.. అయినా కేసీఆర్ వెళ్తారని ప్రచారం !
తెలంగాణకు వస్తున్న ప్రధానిని స్వాగతించేందుకు , వీడ్కోలు పలికేందుకు ప్రోటోకాల్ అవకాశాన్ని మంత్రి తలసానికి ఇస్తూ శుక్రవారం సీఎంవో ఉత్తర్వులు ఇచ్చింది. అప్పుడే కేసీఆర్ వెళ్లడం లేదని ఓ క్లారిటీ వచ్చింది. అయితే సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. కేసీఆర్ స్వయంగా మోడీని రిసీవ్ చేసుకుంటారని.. పర్యటన మొత్తం ఆయనతోనే ఉంటారని మీడియాకు అనధికారిక సమాచారం ఇచ్చారు. మధ్యాహ్నం వరకూ అలాగే అనుకున్నారు. కానీ మోడీ హైదరాబాద్‌లో అడుగు పెట్టే ముంద కేసీఆర్‌కు జ్వరమని స్వాగతానికి వెళ్లడం లేదన్నారు. అయితే సాయంత్రం ముచ్చింతల్‌లో జరిగే రామానుజ విగ్రహావిష్కరణకు వెళ్తారని సమాచారం ఇచ్చారు. చివరికి ఆ కార్యక్రమానికీ హాజరు కాలేదు. అంటే తెలంగాణకు వచ్చిన ప్రధానికి సీఎం కేసీఆర్ ఎదురుపడకూడదని డిసైడయ్యారన్నమాట.
నిరసన తెలియచెప్పారా ?
ప్రధాని మోడీ పర్యటనలో పాల్గొనకపోవడం వల్ల కేసీఆర్ తన నిరసనను తెలియచెప్పారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అందుకే కేసీఆర్ దూరంగా ఉన్నారని అంటున్నారు. బడ్జెట్ పెట్టిన రోజునప్రెస్‌మీట్ పెట్టిన కేసీఆర్ మోదీపై విరుచుకుపడ్డారు. ఆయన నాయకత్వం దేశాన్ని నాశనం చేస్తోందన్నారు. ఆ ప్రెస్‌మీట్‌లో రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు బీజేపీ ఉద్యమం ప్రారంభించింది. ఈ సమయంలో మోడీతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం బాగుండదని కేసీఆర్ అనుకున్నట్లుగా తెలుస్తోంది.
ప్రాంతీయ పార్టీల నేతల్లో సందేహాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారా?
గతంలో బీజేపీయేతర ముఖ్యమంత్రులు కొద్ది మంది తప్ప ఎక్కువ మంది మోడీ రాష్ట్రాల పర్యటనలకు వస్తే స్వాగతం పలికేవారు కాదు. కానీ కేసీఆర్ అలా కొట్టరని అనుకున్నారు. ఎందుకంటే సమతామూర్తి విగ్రహావిష్కరణ విషయంలో కేసీఆర్‌కు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది. అయితే మోడీ పర్యటనలో పాల్గొంటే.. బీజేపీ, కేసీఆర్ ఒకటేనన్న ప్రచారం ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిసారించారు. ప్రాంతీయ పార్టీలతో భేటీ నిర్వహిస్తుననారు. గత అనుభవాలతో కేసీఆర్ ఎక్కువగా బీజేపీకి దగ్గరే అని నమ్ముతున్నారు. ఇలాంటి నమ్మకాన్ని కేసీఆర్ దూరం చేుకోవాల్సి ఉంది. అందుకే ఆయన ప్రధానిపై అలా విరుచుకుపడుతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. అందుకే టూర్‌కుడుమ్మా కొట్టారన్న అంచనాలు ఉన్నాయి.
కేసీఆర్ పాల్గొనడం మోడీకి ఇష్టం లేదన్న సంకేతాలు వచ్చాయని ఆగిపోయారా ?
అదే సమయంలో ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల విషయంలో ప్రధాని మోడీ అసంతృప్తిగా ఉన్నారని.. కేసీఆర్‌తో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అయిష్టత చూపారన్నప్రచారం ఉంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రగతి భవన్‌కు సమాచారం వచ్చిందని చెబుతున్నారు. అందుకే స్వాగతం పలకడానికి కూడా సిద్ధమై ఆగిపోయారని అంటున్నారు. మొత్తంగా చూస్తే కేసీఆర్ ప్రధాని మోడీతో పాటు కార్యక్రమాల్లో పాల్గొంటే ఓ రకమైన చర్చ జరిగేది.. పాల్గొనలేదు కాబట్టి మరో రకమైన చర్చ జరుగుతోంది.