కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి మంచి పట్టు ఉన్న కొత్తగూడెం నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వర్గపోరు తీవ్రతరమైంది. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎడవల్లి కృష్ణతోపాటు జిల్లా నాయకులు నాగా సీతారాములు ఉన్నారు. ఇప్పటి వరకు వీరివురు వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెంలో క్యాంప్ ఏర్పాటు చేయడంతో గ్రూపు రాజకీయాలు మరింతగా పెరిగాయి.
2018 ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత వనమా టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సైతం ఆయనతోపాటు టీఆర్‌ఎస్‌లోకి చేరారు. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనపడినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నట్లు కనిపించింది. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అయితే గత రెండు నెలలుగా ఈ పరిస్థితి మారిపోయింది.
భట్టి ఆశీస్సులతో టిక్కెట్ నాదే అంటున్న పోట్ల..
రెండు నెలల నుంచి కొత్తగూడెం కాంగ్రెస్ టిక్కెట్‌పై కన్నేసిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఇక్కడ క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆశీస్సులు తనకు ఉన్నాయని, తనకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ వస్తుందని ప్రచారం చేస్తుండటంతో ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకుని చురుగ్గా నేతల్లో కలవరం మొదలైంది. ప్రతి కూల పరిస్థితుల్లో సైతం పార్టీని అంటిపెట్టుకుని ఉండి ఇన్ని రోజులు తాము పార్టీ బలోపేతానికి కృషి చేస్తుండగా వలస నాయకులు వచ్చి పార్టీలో చిచ్చు పెడుతున్నారని మిగిలిన వారు ఆరోపిస్తున్నారు.
మూడు ముక్కలుగా కాంగ్రెస్..
మాజీ ఎమ్మెల్సీ పోట్ల రాకతో కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలుగా మారింది. నాయకులు సైతం విడివిడిగా కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం. పోట్ల నాగేశ్వరరావు గ్రూపు ఒక వర్గంగా కార్యక్రమాలు చేస్తుండగా, టీపీసీసీ సభ్యులు ఎడవల్లి కృష్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగసీతారాములు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు చేపట్టడం పార్టీలో గందరగోళంగా మారింది. పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు సైతం వేర్వేరుగా చేపడుతుండటంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సైతం గ్రూపు రాజకీయాలపై దృష్టి పెట్టకపోవడంతో నాయకుల మద్య దూరం పెరుగుతూనే ఉంది. స్థానికంగా ఉంటూ ఎన్నో ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న అకస్మాతుగా వలస నాయకులు ఇక్కడికి వస్తున్నారంటూ నాయకులు బహిరంగంగానే విమర్శలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించాలని, పార్టీకి గట్టి పట్టు ఉన్న కొత్తగూడెంలో వర్గ విబేదాలకు చెక్ పెట్టి పార్టీకి విదేయులుగా ఉన్న స్థానికులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఏది ఏమైనా మాజీ ఎమ్మెల్సీ పోట్ల రాకతో కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది.