తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం కేసీఆరే ప్రయత్నించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. సోనియా గాంధీ వద్దకు టీఆర్ఎస్ ప్రతిపాదన వెళ్లిందని కానీ.. సోనియా గాంధీ పొత్తునకు అంగీకరించలేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అంటే కేసీఆర్ పొత్తు అడిగినా కాంగ్రెస్ ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి పొత్తు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని..ప్లీనరీలో విమర్శించలేదని కోమటిరెడ్డి విశ్లేషించారు. ఇటీవల ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అదే సమయంలో టీఆర్ఎస్‌కు ఆయన స్ట్రాటజిస్ట్‌గా ఉండేందుకు అంగీకారం తెలిపారు. ప్రత్యేకంగా ప్రగతి భవన్‌లో రెండు రోజుల పాటు కేసీఆర్ ఆతిధ్యం స్వీకరించి.. సర్వే రిపోర్టులు ఇచ్చి వెళ్లారు. దీంతో కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు అంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది.
మహేందర్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కౌంటర్, ఈసారి టికెట్ తనకేనని విశ్వాసం
అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం టీఆర్ఎస్‌తో పొత్తు అనే మాటే ఉండదని తేల్చి చెబుతున్నారు. తమకు రాహుల్ గాంధీనే చెప్పారని ... నమ్మించి మోసం చేసిన కేసీఆర్‌తో మరోసారి కలిసే ప్రసక్తే లేదన్నారన్నారు. తెలంగాణ ప్రకటిస్త్ టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని గతంలో కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రకటించినప్పటికీ టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయలేదు. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతల్ని టీఆర్ఎస్‌లో చేర్చుకుని చాలా వరకు బలహీన పరిచే ప్రయత్నం చేశారు. ఈ కారణంగా కాంగ్రెస్ హైకమాండ్‌కు టీఆర్ఎస్ అంటే ఆగ్రహం ఉందని పొత్తులు కూడా పెట్టుకునే పరిస్థితి ఉండదని అంటున్నారు.
అయితే భారతీయ జనతా పార్టీ దూకుడుగా ఉండటం.. ఇలా పొత్తుల పై రాజకీయాలన నడవడం వల్ల కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటే అనే అభిప్రాయం బలపడితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పూర్తిగా బీజేపీ వైపు వెళ్తుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని.. గెలవబోయేది కాంగ్రెస్ పార్టీనేనని చెప్పేందుకు టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్ పొత్తు ప్రతిపాదన తెచ్చినా తామే తిరస్కరించామని కోమటిరెడ్డి ప్రకటించడం ద్వారా భవిష్యత్‌లో కూడా ఇక టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని సంకేతాలను ఇచ్చినట్లయింది.
తెలంగాణలో తాము తిరుగులేని స్థానంలో ఉన్నామని.. ఒకరితో పొత్తు అనే ప్రశ్నే లేదని టీఆర్ఎస్ నేతలు ఖరాఖండిగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కోమటిరెడ్డి ప్రకటన చర్చనీయాంశమవుతోంది. దీనిపై టీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.