దేశానికి కావాల్సింది ఫ్రంట్‌లు.. టెంట్‌లు కాదని రాజకీయ ఎజెండాలోనే పెను మార్పులు రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో తన పాత్ర ఖచ్చితంగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణా ఉద్యమంలా దేశ రాజకీయాల్లో టీఆర్ ఎస్ ముందుకు వెళ్ళడం ఖాయమని కేసీఆర్ ధఈమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆర్థిక పరిస్థితిపై సీఎంకేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క పిలుపు ఇస్తే రూ. ఆరు వందల కోట్ల విరాళాలు వస్తాయన్నారు. ఇప్పటికే పార్టీకీ అద్భుతమైన నిధులు సమకూర్చుకున్నామని ప్రకటించారు. 865 కోట్ల నిధులు టీఆర్ ఎస్ ఖాతాలో ఉన్నాయని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిధుల్ని ఎస్‌బీఐ , బ్యాంక్ ఆఫ్ బరోడాలో దాచామని కేసీఆర్ ప్రకటించారు. మిగిలినవి స్థిరాస్థి రూపంలో ఉన్నాయి.ఢిల్లీలో తెలంగాణా భవనం సిద్ధం కాబోతోందని ప్రకటించారు. మొత్తంగా టీఆర్ఎస్‌కు రూ. వెయ్యి కోట్ల ఆస్తులున్నాయన్నారు.
టీఆర్ఎస్ విజయంపై వస్తున్న కారు కూతలు పట్టించుకోవద్దని కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే.. ఏ మాత్రం సందేహం వద్దన్నారు. కన్సల్టెంట్ ను పెట్టుకున్నామని.. వారు చేసిన సర్వేలోనే 90 సీట్లు వస్తాయని తేలిందన్నారు. భారత దేశంలోనే తెలంగాణా ధనిక రాష్ట్రం కాబోతోందని ప్రకటించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదని కానీ కేంద్రమే పదే పదే టాక్సులు పెంచిందన్నారు. అదే పనిగా ఎక్సైజ్ టాక్స్‌ను పెంచిన కేంద్రం ఇప్పుడు రాష్ట్రలను ట్యాక్స్ తగ్గించమని అడగటం సిగ్గు చేటని మండిపడ్డారు. కరోనాపై మీటింగ్ పెట్టి పెట్రోల్, డీజిల్‌పై టాక్స్‌లు తగ్గించాలని కోరడంఏమిటని ప్రశ్నించారు.
బీజేపీ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టే కుట్ర చేస్తోందని కేసీఆర్ విమర్శించారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో హిందూ ముఖ్యమంత్రులే ఉంటే.. ఎక్కడ హిందువులకు అన్యాయం జరుగుతుందని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో అశాంతి చెలరేగి కర్ఫ్యూలు పెట్టాలా అని ప్రశ్నించారు. విదేశాల్లో కూడా మన గుడులు ున్నాయని.. వారు ప్రగతి పూర్వకంగా ఆలోచిస్తున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. మనిషి కోసం మతమా.. మతం కోసం మనిషా.. అని సూటిగా ప్రశ్నించారు. ప్రపంచం ఓ గ్రామంగా మారితే.. ఇలాంటి విద్వేషాలు అవసరమా..? అని బీజేపీని కేసీఆర్ ప్రశ్నించారు. ఎనిమిదేళ్ల లో ప్రధాని మోడీ ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ చేశారు. దేశం అన్నింటిలో క్రిందికి పోయిందని.. ప్రసంగాల హోరు.. అబద్దాల జోరు తప్ప ఏమీ లేదన్నారు. మోడీ తస్మాత్ జాగ్రత్త.. మీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు.