మే 10వ తేదీ నుంచి ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రెండేళ్లలో ఎన్నికలు రానున్నందున ఇప్పటి నుండే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో ఏం చేయాలో రోడ్ మ్యాప్ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పథకాలు తీసుకున్న వారి జాబితాను ఆయా జిల్లాల అధ్యక్షులకు అందుతాయని.. ఎవరికైనా పథకాలు అందకపోతే వారికి అందించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. జూలై 8వ తేదీన పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామని జగన్ పార్టీ నేతలకు తెలిపారు.
65 శాతం మంది ఎమ్మెల్యేలకు సర్వేలో మంచి గ్రాఫ్ !
ఎన్నికలకు ముందు ఓ ఆలోచనా విధానంతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం జగన్ కార్యాచరణను దిశానిర్దేశం చేశారన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి చెబుతామన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం పాజిటివ్‌గా ఉందన్నారు. పార్టీ పరంగా సర్వేలు చేయిస్తున్నామని.. సర్వేల్లో వెనుకబడిన వారికి.. జనాదరణ కోల్పోయిన వారికి టిక్కెట్లు దక్కబోవని మాజీ మంత్రి కొడాలి నాని సమావేశం తర్వాత ప్రకటించారు. 65 శాతం ఎమ్మల్యేల గ్రాఫ్ బాగుందని సీఎం జగన్ తతెలిపారు. పలువురు ఎమ్మెల్యేల గ్రాఫ్‌లలో హెచ్చతగ్గులు ఉన్నాయని.. గ్రాఫ్ పెంచుకోవాలని జగన్ సూచించారని కొడాలి తెలిపారు. ఓడిపోయే వారికి ఏ రాజకీయ పార్టీ కూడా టిక్కెట్లు ఇవ్వబోదన్నారు.
గ్రామ వార్డు సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి !
చంద్రబాబు కుయుక్తులను పార్టీ పరంగా ఎదుర్కోవాలని.. పార్టీని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాలని సీఎం జగన్ సూచించారని కొడాలి నాని తెలిపారు. గ్రామ , వార్జు సచివాలయాల్లో ఓ పుస్తకం అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే.. ప్రజలు ఆ పుస్తకంలో రాసే అవకాశం కల్పిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల సందర్శన విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సీరియస్‌గా ఉండాలని జగన్ స్పష్టం చేశఆరు. నెలకు కనీసం పది గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలన్నారు. సర్వేల్లో పార్టీకి మైనస్‌గా మారిన పలు అంశాలపై ఎలా స్పందించాలో జగన్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.
అసలు వైఎస్‌ఆర్‌సీపీకి 175 సీట్లు ఎందుకు రాకూడదు ?
ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం వచ్చే ఎన్నికల్లోనూ 151 సీట్లు సాధించడమేనని జగన్ స్పష్టం చేశారు. 175కి 175 సీట్లు ఎందుకు రాకూడదని ఎమ్మెల్యేల్ని జగన్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. భారీ మెజార్టీతో ప్రజలు మనకు అధికారం కట్టబెట్టారని అదే స్థాయిలో మళ్లీ సీట్లు సాధించాల్సిందేనని జగన్ స్పషఅటం చేశారు. మంత్రులుగా ఉన్న వాళ్లు ఒక అడుగు వెనక్కి వేసి అందర్నీ కలుపుకుని వెళ్లాలన్నారు. గెలిచేందుకు వనరులు సమకూర్చుతానని హామీ ఇచ్చారు.