తెలంగాణ రాష్ట్ర సమతి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై తన ఆలోచనలను వివరించారు. నేరుగా చెప్పకపోయినప్పటికీ... భారతీయ రాష్ట్ర సమితిపేరుతో జాతీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందని పరోక్షంగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలాగా... భారతీయ రాష్ట్ర సమితిని పెట్టాలని కోరుతున్నారని ప్రకటించారు. ఈ దిశగా వర్కవుట్ చేస్తున్నట్లుగా ఆయన ప్రసంగం ద్వారా స్పష్టమయిది.  బీజేపీని గద్దె దించాలనే రాజకీయ  టార్గెట్ పెట్టుకున్నట్లుగా ప్రజల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. ప్రజల బతుకులు మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఈ ప్రకారం చూస్తే కేసీఆర్ జాతీయ పార్టీని సమయం చూసి ప్రకటించడం ఖాయమని భావిస్తున్నారు. 


భారతీయ రాష్ట్ర సమితి !


తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్ఎస్‌ను కేసీఆర్ ఏర్పాటు చేశారు.  పేరుతోనే తెలంగాణ ఉన్న కారణంగా జాతీయ స్థాయిలో విస్తరించే అవకాశం లేకుండా పోయింది. కేసీఆర్ కొంత కాలంగా తాను జాతీయ రాజకీయాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాలు అంటే... తెలంగాణలో ఉన్న ఎంపీ సీట్లలో వీలైనన్ని గెలిచి ఏదో ఓ పార్టీకి మద్దతుగా నిలిచి.. ప్రభుత్వంలో చేరడం. కానీ కేసీఆర్ అంతకు మించి ఆలోచిస్తున్నారు. తెలంగాణను దాటి జాతీయ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అంటే.. తన పార్టీ ఉనికి ఇతర రాష్ట్రాల్లోనూ ఉండాలనుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా అది సాధ్యం కాదు. అందుకే భారతీయ రాష్ట్ర సమితి ఆలోచన చేస్తున్నారు. 


కేసీఆర్‌ ముందున్న ఆప్షన్ జాతీయ పార్టీ మాత్రమే ! 
 
అవసరమైతే జాతీయ పార్టీ పెడతాననని కేసీఆర్ పలు సంద‌ర్భాల్లో చెప్పారు.  ఆయనకు జాతీయ రాజకీయాలపై సంపూర్ణమైన అవగాహన ఉంది. అన్ని సమీకరణాలు చూసిన తర్వాతనే తృతీయ ఫ్రంట్ లేదా.., మరో కూటమిలో చేరడం వర్కవుట్ కాదనే అంనచాకు వచ్చారు. నిజానికి కేసీఆర్ గతంలోనే జాతీయ పార్టీ ప్రకటనకు ఏర్పాట్లు చేసుకున్నారన్న ప్రచారం జరిగింది.   " నయా భారత్" అనే పేరు ఖరారు చేసినట్లుగా  ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో కేసీఆర్ ఈ వార్తల్ని ఖండించారు. ఇప్పుడు తానే స్వయంగా భారతీయ రాష్ట్ర సమితి పేరును ప్రచారంలోకితెచ్చారు. 


రైతునేత ఇమేజ్ కోసం ఇప్పటికే కార్యాచరణ  !


జాతీయ పార్టీ పెట్టాలంటే తెలంగాణ నేతగా అయితే సాధ్యం కాదు. జాతీయ గుర్తింపు ఉండాలంటే దానికి తగ్గ రంగంలో ఉద్యమం చేయాలి. అందుకే కేసీఆర్ రైతు ఎజెండాను ఎంచుకున్నారు. అదే వ్యూహంతోనే కేసీఆర్ జాతీయ స్థాయిలో రైతు నేతగా ప్రొజెక్ట్ అయ్యేందుకు  వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు.  దేశలో ప్రస్తుతం రైతులకోసం నిలబడిన నాయకుడి ఇమేజ్ ఉన్న లీడర్ ఎవరూ లేరు.  రైతు ఉద్యమాన్ని నడిపిన రాకేష్ టికాయత్ రాజకీయ నాయకుడు కాదు. ఓ చరణ్ సింగ్ లాగా.. మరో దేవీలాల్‌లాగా.. సుర్జీత్ సింగ్ బర్నాలాలాగా  రైతుల కోసం రాజకీయాన్ని నడిపిన వారు ప్రస్తుతం లేరు. అలాంటి ఇమేజ్ కోసం రైతు ఎజెండాను  కేసీఆర్ ఎంచుకునే అవకాశ ఉంది.  మరో రైతు ఉద్యమం కావాల్సి ఉంటుందన్న రాకేష్ టికాయత్ .. దానికి సమర్థుడైన నేతగా కేసీఆర్‌ను భావిస్తున్నారు. అందుకే ఆయన మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ  క్రమంలో దేశంలోని రైతు సంఘాలన్నీ కేసీఆర్‌కు మద్దతుగా నిలిస్తే.. కేసీఆర్ నాయకత్వంలో మరో రైతు ఉద్యమం దేశంలో బలపడే అవకాశం ఉంది. అదే కేసీఆర్ పార్టీకి మలస్తంభం అయ్యే అవకాశం ఉంది.


అన్నీ కుదిరితే ఒకటి  రెండు నెలల్లోనే పార్టీ ప్రకటన!


కేసీఆర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలపై కసరత్తు చేస్తున్నారు. అవి ఓ కొలిక్కి వస్తున్నందునే కేసీఆర్ జాతీయ పార్టీ గురించి ప్రకటించారని భావిస్తున్నారు. తుది కసరత్తు పూర్తయిన తర్వాత దేశం మొత్తం ఆకర్షించేలా భారీ బహిరంగసభ ఏర్పాటు  చేసి .. జాతీయ పార్టీ ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.