TRS Plenary 2022: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్‌ఎస్ ఆశించిన లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకుందని... తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత తీసుకుందని టీఆర్‌ఎస్ ప్లీనరీ పునరుద్ఘాటించింది. విధ్వంసమైపోయిన ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నట్టు తీర్మానించింది. ఎనిమిదేళ్లుగా చేస్తున్న కృషి ఫలితంగానే నేడు దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఖ్యాతి గాంచిందన్నారు.
బీజేపీ అసమర్ధత బయటపెట్టుకుంది
అదే టైంలో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించలేని బీజేపీ ప్రభుత్వం తన అసమర్థతను బయటపెట్టుకుందని టీఆర్‌ఎస్ ప్లీనరీ సభ తీర్మానించింది. ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన అభివృద్ధి గురించి తెలియజేస్తూ ప్రజల ముందుకు ప్రత్యామ్నాయ ఎజెండా ముందుకు తీసుకురావడంలో దేశంలోని రాజకీయ పక్షాలు విఫలమవుతున్నాయన్నారు సీఎం కేసీఆర్. ఫలితంగా దేశం విపత్కర పరిస్థితులో చిక్కుకొని విలవిల్లాడుతోందని అభిప్రాయపడింది. ఇలాంటి సందర్భాల్లో జాతీయ, రాజకీయాల్లో దార్శనికత కలిగిన నాయకత్వం, మసర్థత కలిగిన పార్టీ అవసరం ఎంతైనా ఉందన్నారు.
అచ్చేదిన్ అని దేశాన్ని అధోగతి పాలు
దేశంలో ఉన్న రాజకీయ శూన్యత పూరించడానికి టీఆర్‌ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిన చారిత్రక అవసరం ఉందని తీర్మానించారు. దేశంలో అచ్చేదిన్ తీసుకొస్తామని చెప్పిన బీజేపీ... దేశాన్ని మరింత అధోగతి పాలు చేసిందన్నారు. ఆర్థిక వృద్ధి క్షిణించేలా అన్నిరంగాలను నాశనం చేసిందన్నారు. దేశం పరిస్థితి ఘోరంగా పతనమైపోతుంటే.. దాన్ని చక్కదిద్దాలన్న తపన ఇంతైనా లేదని ధ్వజమెత్తింది టీఆర్‌ఎస్. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజల్ని నిట్టనిలువునా విభజిస్తూ... మత కల్లోలాల మంటల్లో చలి కాచుకుంటున్నారన్నారు.
దేశం కోసం ధర్మం కోసమంటూ జాతి సంపదను అమ్మేస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం హయాంలో అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల మొత్తం విలువ దాదాపు మూడున్నర లక్షల కోట్లని చెప్పారు. పేద ప్రజలకు పైస విదిల్చని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దోచి పెడుతోందన్నారు.
బడా పెట్టుబడిదారులు కట్టకుండా ఎగవేసిన 11 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మాఫీ చేసిందన్నారు. బ్యాంకులను లూఠీ చేసిన బడా బందిపోటు దొంగలు విదేశాల్లో తలదాచుకోవడానికి బీజేపీ ప్రభుత్వం అందిస్తుందన్నారు. నోట్ల రద్దు, లాక్‌డౌన్, లాంటి నిర్ణయాలు రాత్రికిరాత్రే తీసుకొని ప్రజలను ఇబ్బందిలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వానిది అంతలేని వైఫల్యాల చరిత్రయితే.. తెలంగాణ ప్రభుత్వానికి అద్భుత సాఫల్యలా చరిత్రగా అభివర్ణించారు. దేశంలోని రాష్ట్రాలకు సంబంధించి అప్పుల విషయంలో తెలంగాణ చివరి నుంచి మూడో ర్యాంకులో ఉందని... తెలంగాణ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి ఉన్నాయన్నారు.
ఇప్పటికైనా పరిస్థితులు మారాలని తీర్మానించింది టీఆర్‌ఎస్. దేశానికి పట్టిన ఈ దుర్దశను వదిలించుకోవాలన్నారు. దేశ ప్రజల బతుకులను దుర్భరం చేస్తూ విభజించి పాలించే దుర్నీతికి పాల్పడుతున్న దుష్ట పాలన అంతమొందించేందుకు టీఆర్‌ఎస్ నడుంబిగిస్తుందన్నారు. తెలంగాణను ఎలా ఆర్థికంగా, సామాజికంగా , వ్యవసాయికంగా, విద్య, వైద్యంలో అత్యున్నత స్థాయికి తీసుకురాగలిగిందో... దేశంలో కూడా అలాంటి గుణాత్మక మార్పును సాధించే దిశగా కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఆ దిశగా పార్టీ సమాయత్తం కావాలని ప్లీనరీ తీర్మానించింది.