Tandoor News: తాండూర్ నియోజకవర్గంలో అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పందించారు. తాండూరులో ఇప్పటిదాకా ఎలాంటి గొడవలు జరగలేదని, ఇప్పుడు ఈ వివాదం ఎవరు రేపుతున్నారో తాండూర్ ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై రోహిత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
మహేందర్ రెడ్డి సీఐను దూషించిన ఘటనపై తనకేం సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవడం తన విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. పోలీసు అధికారులపై అసభ్య పదజాలంతో దూషించడం సమంజసం కాదని, ఎవ్వరూ దాన్ని సహించబోరని అన్నారు. తన పక్కన ఎలాంటి రౌడీషీటర్లు లేరని చెప్పారు. తాండూర్ నియోజకవర్గంలో ఇద్దరు సర్పంచ్‌లను కూడా పూర్తిగా విచారణ చేశాకే సస్పెండ్ చేశారని, దానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తనపై బురద జల్లే ఉద్దేశంతోనే మహేందర్ రెడ్డి వర్గం ఇలా ప్రచారం చేస్తోందని అన్నారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ విషయంలో రేవంత్‌కు హైకోర్టు ఝలక్! అందుకు అర్హతే లేదని తేల్చిన ధర్మాసనం
వచ్చే ఎన్నికల్లో తాండూర్ టీఆర్ఎస్ టికెట్ నాకే
మంత్రి కేటీఆర్ సహా కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు ఇస్తామని చెప్పారని రోహిత్ రెడ్డి గుర్తు చేశారు. తాండూర్ ప్రజల్లో తనపై ఎలాంటి వ్యతిరేకత లేదని, ఆ ప్రాంతంలో తాను ఎన్నో మంచి పనులు, ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేశానని అన్నారు. తనపట్ల ప్రజలంతా సంతోషంగానే ఉన్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టీఆర్ఎస్ టికెట్ రాదనే డౌట్ ఏమాత్రం లేదని, వంద శాతం తనకే పార్టీ టికెట్ వస్తుందని రోహిత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తన పనితీరు పట్ల కూడా టీఆర్ఎస్ అధిష్ఠానం కూడా సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నోసార్లు సీఎం కేసీఆర్ కూడా తన పనితీరును బహిరంగంగానే మెచ్చుకున్నారని అన్నారు.
గెలుపు గుర్రాల కోసమే టీఆర్ఎస్ పార్టీ చూస్తుంది కాబట్టి, కచ్చితంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తనకే ఇస్తారని అన్నారు. పట్నం మహేందర్ రెడ్డి అసలు తనకు పోటీనే కాదని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు తాను ఆయనతో గొడవ పడాల్సిన అసవరమే లేదని అన్నారు. గతంలో జిల్లా మంత్రి సమక్షంలోనే మనస్పర్థలపై చర్చలు జరిగాయని, అయినా ఆయన సూచనలు పాటించకుండా ఆయన ప్రవర్తించడం సరికాదని అన్నారు. తమ మధ్య ఉన్న విభేదాలపై జిల్లా మంత్రికి పూర్తి అవగాహన ఉందని తెలిపారు. అధిష్ఠానం ఇచ్చిన ఆదేశాల మేరకే తాను నడుచుకుంటున్నట్లు తెలిపారు. తన అనుచరులు, మహేందర్ రెడ్డి మనుషులపై దాడులకు పాల్పడుతున్నారనే వాదనలను కూడా కొట్టిపారేశారు. ఇసుక దందా ఆరోపణలపై మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో ఎలాంటి ఇసుక దందా లేదని స్పష్టం చేశారు.