మంత్రి కేటీఆర్ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మండలం జన్వాడలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫాంహౌస్ నిర్మించుకున్నారని అప్పట్లో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆ అంశంపై రేవంత్ రెడ్డి నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (NGT) చెన్నైలో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే, తాజాగా ఆ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అర్హత లేని ఆ పిటిషన్‌పై సంయుక్త కమిటీ విచారణకు ఆదేశించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. రేవంత్‌రెడ్డి పిటిషన్‌ను, ఎన్‌జీటీ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని మంత్రి కేటీఆర్ సహా ఫామ్‌ హౌస్‌ యజమానిగా ఉన్న ప్రదీప్‌ రెడ్డి వేర్వేరుగా రిట్ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిని అనుమతిస్తూ జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌ రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావ్‌ల డివిజన్‌ బెంచ్‌ బుధవారం తీర్పు చెప్పింది. 


ఎన్‌జీటీ నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగిన ఆరు నెలల్లోగా ఎవరైనా ఫిర్యాదు చేయాలని, అయితే ఏనాడో నిర్మాణం జరిగిన దానిపై రేవంత్‌ పిటిషన్‌ వేస్తే దానిని ఎన్‌జీటీ విచారించే అర్హత లేదని చెప్పింది. పైగా, కేటీఆర్‌ ఆ నిర్మాణం చేయలేదని, ఆ భూమికి యజమాని కూడా కాదని చెబుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తేల్చింది. మంత్రి కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎన్‌జీటీ ఉత్తర్వులు జారీ చేయడం సరికాదు. నోటీసుల్లేకుండానే సంయుక్త కమిటీ ఏర్పాటు కూడా సరికాదు. ఫాం హౌస్‌ ఓనర్‌ ప్రదీప్‌ రెడ్డిని ప్రతివాదిగా చేర్చకుండా రేవంత్‌ ఎన్‌జీటీలో పిటిషన్‌ వేసి ఉత్తర్వులు పొందడం కుదరదని హైకోర్టు అభిప్రాయపడింది. 


ఎన్‌జీటీ ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలేగానీ హైకోర్టు జోక్యం చేసుకోడానికి వీల్లేదన్న రేవంత్‌ రెడ్డి వాదనను హైకోర్టు తిరస్కరించింది. ఎన్‌జీటీ ఉత్తర్వులపై జోక్యం చేసుకునే పరిధి హైకోర్టులకు కూడా ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది.


హిమాయత్‌ సాగర్, ఉస్మాన్‌ సాగర్‌ జంట జలాశయాల చుట్టుపక్కల నిర్ణీత ప్రాంతం వరకూ ఎలాంటి కట్టడాలు చేపట్టవద్దని జీవో 111 చెబుతోంది. ఆ జీవోను ఉల్లంఘించి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జన్వాడలో ఫామ్‌ హౌస్‌ కట్టుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. అప్పట్లో ఈ విషయంపై దుమారమే రేగింది.