TRS MLC Patnam Mahender Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సీఐపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేగుతున్నాయి. ఈ క్రమంలో ఆయనే ప్రెస్ మీట్ పెట్టి, వివరణ ఇచ్చారు. సీఐ రాజేందర్‌ను బెదిరించినట్లు చెబుతున్న ఆడియో తనది కాదని కొట్టిపారేశారు. తనపై అక్రమంగా నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పారు. పోలీసులంటే తనకు బాగా గౌరవం ఉందని, తాను గతంలో తాండూరు నుంచి 1994 నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా పని చేశానని గుర్తు చేశారు. అధికారులు అంతా తాండూరులో పని చేయాలని కోరుకునే వారని అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజల మద్దతు ఎప్పుడూ తనకే ఉంటుందని అన్నారు. జాతర సందర్భంగా భార్యను చంపిన ఓ వ్యక్తికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇచ్చానని, దానిపై పోలీసులతో మాట్లాడానని అన్నారు.- తనకు పోలీసులపై ఎప్పుడూ గౌరవం ఉంటుందని అన్నారు.


తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపైనా మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేతో తనకు ఉన్న వివాదాలు గురించి విలేకరులు ప్రశ్నించగా, నియోజకవర్గంలో అరాచకం ఉందని అన్నారు. ఇష్టం లేని వారిపై అనవసర కేసులు పెట్టించడం వంటివి చేస్తారని అన్నారు. తాండూరు ప్రజల్ని అడిగితే అన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. కర్ణాటకకు ఇసుక తరలిస్తూ దందా సాగుతోందని అన్నారు. ఈ అరాచకాలపై పార్టీ అధిష్ఠానానికి చెప్పామని, వారు చూసుకుంటారని అన్నారు. తాను మళ్లీ ఎమ్మెల్యేగా తాండూరు నుంచి పోటీ చేస్తానని, ఈసారి టీఆర్ఎస్ తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


అసలేం జరిగిందంటే..
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సీఐను ఫోన్ కాల్‌లో దూషించిన కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాండూర్ సీఐ రాజేందర్ రెడ్డిని ఆయన అసభ్య పదజాలంతో దూషించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. 3 రోజుల క్రితం తాండూరు పట్టణంలో భావిగి భద్రేశ్వరస్వామి జాతర జరిగింది. ఆ జాతర సందర్భంగా స్థానిక ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గీయులకు రెడ్ కార్పెట్ వేశారు. ఆ తీరుపై మహేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. రెడ్ కార్పెట్ ఎందుకు వేశారంటూ కోపంతో ఊగిపోయిన ఆయన అసభ్య పదజాలంతో సీఐపై విరుచుకుపడ్డారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫైలట్ రోహిత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు నెలకొని ఉంది.