కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాలు హైదరాబాదులో నిర్వహించే నైతిక హక్కు లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరగనున్న కేంద్ర మంత్రి అమిత్ షా సభ నేపథ్యంలో ఏర్పాట్లను కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకుండా ఓట్ల రాజకీయాలు చేసి అమరుల త్యాగాలను మరిచారని ఆరోపించారు. కర్ణాటక, మహారాష్ట్రలలో అధికారికంగా వేడుకలు నిర్వహించి హైదరాబాదులో మాత్రం నిర్వహించకపోవడానికి తప్పు పట్టారు.
అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యత దినంగా పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మరి మైదానంలో కేంద్ర అధికారిక కార్యక్రమాన్ని బిజెపి సభకు హైదరాబాద్ పోలీసులు సర్కిల్ ఇవ్వడంపై పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సర్క్యులర్ ఇవ్వడంపై క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. శతాబ్దాల బానిస సంకెళ్లను తుంచేసిన ఉద్విగ్న సందర్భం. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణం. రాజరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన అద్భుత పరిణామం. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. నా దేశం భారతదేశం అని గర్వంగా ప్రతీ తెలంగాణా పౌరుడు నినదించిన తారీఖు సెప్టెంబర్-17. అందుకే తెలంగాణా చరిత్రలో ఈ స్వర్ణాక్షర లికితం అని ఇంతటి ఘన చరిత్ర తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం మూర్ఖత్వం అవుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
సెప్టెంబర్ 17... తెలంగాణ చరిత్ర కీలక మలుపు తిరిగినరోజు. ఆనాటి భారత ప్రభుత్వ సైనిక చర్య ద్వారా స్వతంత్ర రాజ్యంగా ఉన్న తెలంగాణ భారతదేశంలో భాగమైన రోజు దీన్ని ప్రభుత్వాలు విస్మరించడం సరికాదని కిషన్ రెడ్డి వెల్లడించారు.
ఒక్కో రాజకీయ పార్టీ దీన్ని ఒక్కోలా అభివర్ణిస్తూనే ఉన్నాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బీజేపీ దీన్ని విమోచన దినంగా పాటిస్తుంటే కాంగ్రెస్, కమ్యూనిస్టులు విద్రోహం దినంగా ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని విలీన దినోత్సవంగానే పాటిస్తున్నప్పటికీ ప్రభుత్వం తరుపున అధికారికంగా నిర్వహించట్లేదని తెలిపారు. ఇకనైనా బీఆర్ఎస్ వైఖరి మార్చుకొని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా...
రేపు పరేడ్ గ్రౌండ్ లో బిజెపి ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ముందుగా శంషాబాద్ ఎయిర్పోర్టులో అమిత్ షాకు రాష్ట్ర బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో ని కొల్లాపూర్ లో జరిగిన భారీ బహిరంగ సభలో బిజెపి పై సీఎం కేసీఆర్ విమర్శించడం సరికాదని కిషన్ రెడ్డి అన్నారు.