Pawan Kalyan: వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఘాటు  విమర్శలు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘జగన్.. నువ్వేమైనా దిగొచ్చావా? నువ్వెంత? నీ బతుకెంత? నీ స్థాయి ఎంత? సీఎం పదవి ఉందని ఓ ఫీలై పోవద్దు. ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో సారి వైసీపీ, జగన్ గెలిస్తే ఏపీ ప్రజలు భరించగలరా అంటూ ప్రశ్నించారు. తాను టీడీపీతో పొత్తు కోసం తహతహలాడలేదన్నారు. టీడీపీతో పొత్తు ఆమోదించినందుకు జనసేన కార్యకర్తలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. 


‘జగన్ మానసిక రోగి’
సీఎం జగన్ కు అదో రకమైన మానసిక సమస్య ఉందని, దాన్ని పిచ్చి అంటారని పవన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కేంద్రంలో మాట్లాడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎయిమ్స్ నుంచి మెడికల్ టీమ్ ను ఏపీకి పంపించి జగన్‌ను చెక్ చేయాలని కేంద్రాన్ని కోరతానని చెప్పారు. ఏదైనా ప్రశ్న అడిగితే, చేతిలో పేపర్ లేకపోతే సరిగ్గా సమాధానం చెప్పలేని వ్యక్తి జగన్ అని, మానసిక పరిస్థితి సరిగ్గా లేని అలాంటి వ్యక్తులు పరిపాలన చేయడానికి అనర్హులు అవుతారని భారత రాజ్యాంగంలోనే పేర్కొన్నారంటూ పవన్ సంచలనానికి తెరతీశారు. ఏపీని ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చేతిలో పెట్టడం కరెక్ట్ కాదన్నారు.


‘చనిపోవడానికి సిద్ధపడే పార్టీ‘
చనిపోవడానికి సిద్ధమై పార్టీ పెట్టినట్లు పవన్ అన్నారు.  2014లో పార్టీ పెట్టినప్పుడు తన పక్కన ఎవరూ లేరని, తాను ఒక్కడినే ఉన్నా అన్నారు. మరణానికి సిద్ధపడే ఆ రోజు పార్టీ పెట్టానని, ఈ రోజు సత్యాన్ని ఆవిష్కరింపజేస్తున్నా అని అన్నారు. ఈ పోరాటంలో తనను పంచేసినా పర్లేదని, చైతన్యం లేకుండా పిరికితనంతో ఉన్న తెలుగుజాతిని మేల్కొలపడానికి తెగిస్తానని అన్నారు. 40 ఏళ్ల అనుభవమున్న ఓ పార్టీ కూడా ఒడుదొడుకులు ఎదుర్కొంటోందని, సమస్యల మధ్య పార్టీని నడుపుతున్నానంటే అది రాజ్యాంగం ఇచ్చిన బలమేనని చెప్పారు. 


‘ఐపీఎస్ అధికారులు సిగ్గుపడాలి’
మన దేశం అన్ని ధర్మాలను స్వీకరించిందని, రాజకీయం అంటే వ్యాపారం అనుకునే వారి కోసమే ఇదంతా చెబుతున్నట్లు పవన్‌ కల్యాణ్ వివరించారు. వైసీపీ నేతలకు కనువిప్పు కలిగించేందుకే రాజ్యాంగ ప్రతి తెచ్చానని పార్టీనేతలకు వివరించారు. అధికారంలోకి వస్తే ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని కొందరి భావిస్తున్నారని, చేసే పని సరైందే అని ఐపీఎస్‌ అధికారులకు అనిపిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు సిగ్గు పడాలని అన్నారు. ఎన్ని తిట్టినా భరించామని, పదవి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, సొంత రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారని పవన్ ధ్వజమెత్తారు.


‘అది నా బాధ్యత’
రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితల గురించి వివరించేందుకు ఢిల్లీ వెళ్తానన్నారు. టీడీపీతో పొత్తు అంశాన్ని అమిత్ షా, జేపీ నడ్డాకు వివరిస్తానని, పొత్తు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో తెలియజేస్తానని పవన్ అన్నారు. రాష్ట్రంలో అక్రమ అరెస్ట్‌లు జరుగుతున్నాయని, వాటిని వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎన్డీఏ కూటమిలో తాము ఉన్నామని, పొత్తు అంశాన్ని వారికి వివరించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇండియా భారత్‌ పేర్ల మార్పుపై దేశమంతా చర్చించుకుంటున్నారని, ఇండియా దట్‌ ఈజ్‌ భారత్‌ అని రాజ్యాంగం మొదటి పేజీలోనే ఉందన్నారు. బ్రిటీష్‌ వారికి భారత్‌ అని నోరు తిరగక ఇండియా అని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. 


‘పరిస్థితుల దృష్ట్యా సనాతన ధర్మం మారుతుంది’
తాను ఎప్పుడు భారతీయుడిగానే మాట్లాడుతానని, 389 మంది మేధోమథనం చేయడం వల్ల మన రాజ్యాంగం వచ్చిందన్నారు. రాజ్యాంగాన్ని ప్రజలంతా గుర్తుంచుకోవాలని, సనాతన ధర్మం, తనను తాను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తోందని పవన్ అన్నారు. కాలం, అవసరాలు, పరిస్థితుల మేరకు సనాతన ధర్మం మారుతుందని, ద్వేషం, దోపిడీ కొంతకాలమే ఉంటాయని అన్నారు. ధ్వేషంతో కూడిన వాదనలు కచ్చితంగా కనుమరుగవుతాయని, మార్పును అంగీకరించి, ధర్మాన్ని పాటించి ప్రేమతో ముందుకొచ్చే వ్యక్తులే సమాజానికి దిశా నిర్దేశం చేయగలుగుతారని అభిప్రాయపడ్డారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్లే దేశంలో ఏకత్వం నిలబడింది.