Notice To Poor People Who Living Near CM Jagan Residence:
సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలోని అమరారెడ్డి, మదర్ థెరిసా కాలనీల్లో నివాసం ఉండే పేదలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. వారంలోగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి- తాడేపల్లి నగర పాలక సంస్థ పరిధిలో సీఎం జగన్ ఇంటికి సమీపంలో కాలువకట్ట వెంబడి ఉన్న వెయ్యి మంది ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చారు. ఇళ్లు ఖాళీ చేయాలని, లేని పక్షంలో తామే బలవంతంగా తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో అమరారెడ్డి నగర్‌, మదర్‌థెరీసా కాలనీ వాసులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 


ముఖ్యమంత్రి జగన్ భద్రత విషయంలో ఇబ్బందులొస్తాయని కారణంతో ఏడాది క్రితం ఇక్కడ ఉన్న వారు ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు కాలనీ వాసులకు సూచించారు. ఆ సమయంలో తమకు ప్రత్యామ్నాయం చూపిస్తే ఖాళీ చేస్తామని ఆయా కాలనీ వాసులు చెప్పారు. ఈ క్రమంలో వారందరికీ ఇటీవల అమరావతిలో సెంటు స్థలం కేటాయించారు. ప్రస్తుతం అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణ పనులు కోర్టు ఆదేశాలతో నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా వార్డు సచివాలయ వాలంటీర్లు కాలనీ వాసుల ఇళ్లకు నోటీసులు అందజేశారు. వారంలోగా నివాసాలను ఖాళీ చేయాలని సూచించారు.


దీంతో ఆ కాలనీ వాసులు భయాందోళన చెందుతున్నారు. తాము 30, 40 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నామని అన్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపకుండా ఏడు రోజుల్లో చేయాలని చెప్పడం ఎంత వరకు సమంజశమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇళ్లు ఖాళీ చేయమంటే ఎలా అని బాధితులు వాపోతున్నారు. ఇప్పుడు ఉన్న ఇళ్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. పెద్దల కోసం పేదలను ఖాళీ చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


అధికారుల నుంచి నోటీసులు అందుకున్న వారిలో ఎక్కువ శాతం దళిత వర్గాలకు చెందిన వారే ఉన్నారు. వీరంతా రోజువారి కూలీ పనులకు వెళ్లి కడుపు నింపుకునే వారే. ఇప్పుడు సీఎం భద్రత సాకుతో ఉన్న ఇళ్లను ఖాళీ చేయిస్తే తాము ఎక్కడ ఉండాలని, తమ జీవితాలు రోడ్డు మీద పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయం చూపిస్తే అక్కడికి వెళ్తామని అంటున్నారు. దీనిపై సీఎం జగన్‌కు వినతి పత్రం ఇవ్వాలని భావించినా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో చివరిగా వారికి ఉన్న ఒకే ఒక్క అవకాశం కూడా లేకుండా పోయిందని వాపోయారు.


ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము నోటీసులు అందిస్తున్నట్లు సచివాలయ వలంటీర్లు చెప్పారు. నీటి పారుదల అధికారులు స్పందిస్తూ.. కాలువ కట్ట అంతా నీటి పారుదల శాఖకు చెందినదని, చట్టం ప్రకారం కాలువ కట్ట వెంబడి శాశ్వత నివాసాలు ఉండడానికి వీళ్లేదని చెబుతున్నారు. కాలువ కట్టల వెంబడి నివసించడానికి వీళ్లేదన్నారు. బాధితులకు వామపక్షాల నేతలు అండగా నిలిచారు. నిర్వాసితులకు ఎక్కడైనా ప్రత్నామ్నాయం చూపించాలని, ఆ తరువాతే ఖాళీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లోకపోతే ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.