TDP Parliamentary Party Meeting In Delhi: 
ఈనెల 18నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా అన్ని పార్టీలు.. ఎంపీలతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిసారి టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగేది. కానీ తొలిసారిగా ఈ సమావేశానికి నారా లోకేష్ నేతృత్వం వహించారు. ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. లోక్ సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో ఈ మీటింగ్ జరిగింది.  


చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం హైలైట్ కావాలి..
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యవహారం హైలైట్ కావాలంటూ నారా లోకేష్ ఎంపీలకు సూచించారు. కనీస ఆధారాలు లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేశారని, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు నెలకొన్నాయని, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తూ పోలీసులు.. పౌరుల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని.. ఈ వ్యవహారాలన్నీ పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలన ఆయన సభ్యులకు సూచించారు. పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించడంతోపాటు, సభ బయట కూడా శాంతియుత నిరసన చేపట్టాలని, తద్వారా దేశవ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరిగేలా చేయాలని సూచించారు లోకేష్. 


బిల్లుల విషయంలో ఎలా..?
2019ఎన్నికల్లో కలసి పోటీ చేయకపోయినా.. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేసినా.. పార్లమెంట్ లో మాత్రం బీజేపీతో శత్రుత్వం కోరుకోలేదు టీడీపీ. ఇప్పుడు పరిస్థితులు మరింతగా మారిపోయాయి. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన, టీడీపీ పొత్తుకోరుకుంది. అంటే ఇప్పుడు బీజేపీ, టీడీపీ కూడా మిత్రపక్షాలే అనుకోవాలి. ఈ దశలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులకు టీడీపీ బేషరతుగా మద్దతు తెలపాల్సి ఉంటుంది. బిల్లులపై ఎలాంటి వైఖరి అవలంబించాలి అనే విషయంపై కూడా నారా లోకేష్ సభ్యులతో చర్చించారు. 


పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా కూడా ఇటీవలే విడుదలైంది. సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు 75 ఏళ్ల భారత పార్లమెంటరీ ప్రస్థానంపై చర్చ జరుగుతుంది. భారత్ సాధించిన ఘనతలు, అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న అంశాలను ఈ సమావేశంలో సభ్యులు చర్చిస్తారు. ఇక బిల్లుల విషయానికొస్తే.. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి కేంద్రానికి అదనపు అధికారాలు దఖలు చేసే కొత్త బిల్లుకి బీజేపీ ఆమోదముద్ర వేయించుకోవాలని చూస్తోంది. ఈ బిల్లుతో పాటు ముఖ్యమైన మరో నాలుగు బిల్లులు కూడా ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెడతారని అంటున్నారు. ఈ బిల్లుల విషయంలో కూడా టీడీపీ ఆచితూచి స్పందించాల్సి ఉంటుంది. బీజేపీతో కలసి వెళ్లాలనుకుంటున్న టీడీపీ అనివార్యంగా అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు చెప్పాల్సిన పరిస్థితి. ఈ దశలో టీడీపీ టీమ్, పార్లమెంట్ లో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.



పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో వ్యూహ రచనకు అటు వైసీపీ కూడా కసరత్తులు చేస్తోంది. పార్లమెంట్ సమావేశాలకు ముందుగానే సీఎం జగన్, ఢిల్లీ టూర్ ఉంటుందని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. అయితే పార్లమెంట్ లో వైసీపీ కూడా బీజేపీకి అనుకూలంగా నడుచుకునే అవకాశముంది.