Sanatana Dharma Row: 



మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు..


సనాతన ధర్మం వివాదంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం తల్లిదండ్రుల్ని, గురువులను గౌరవించమని చెప్పిందని, పేదలను సంరక్షించాలని ఉపదేశించిందని వెల్లడించింది. సనాతనం అంటే కేవలం కుల వ్యవస్థ, అంటరానితనం అని మాత్రమే అభిప్రాపడడం సరికాదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న వివాదంపైనా అసహనం వ్యక్తం చేసింది. అంటరానితనం ఎక్కడ ఉన్నా దాన్ని కచ్చితంగా చెరిపేయాలని, అలాంటి వాటిని సహించకూడదని తేల్చి చెప్పింది. అది సనాతన ధర్మం పేరిట చేస్తే మరింత ఖండించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కే అయినప్పటికీ...ఇది విద్వేషాలు పెంచేదిగా ఉండకూడదని స్పష్టం చేసింది. ముఖ్యంగా మతం గురించి మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎవరి ప్రసంగం అయినా సరే...ఎవరి మనోభావాలనూ దెబ్బ తీసే విధంగా ఉండకూడదని చెప్పింది. 


"ప్రతి మతంలోనూ, ధర్మంలోనూ కొన్ని విశ్వాసాలుంటాయి. సనాతన ధర్మం అంటే కేవలం కుల వ్యవస్థ, అంటరానితనం మాత్రమే కాదు. దేశం కోసం ఏదోటి చేయడం, తల్లిదండ్రుల్ని గౌరవించడం, పేదలకు అండగా ఉండడం లాంటి ఎన్నో మంచి విషయాలను బోధించింది ఈ ధర్మం. కేవలం ఒకే కోణంలో ఆలోచించకూడదు. అంటరానితనం ఎక్కడ ఉన్నా కచ్చితంగా ఖండించాల్సిందే. సనాతన ధర్మం పేరిట ఇలా ప్రవర్తించినా అంగీకరించకూడదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని రద్దు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కే కావచ్చు. కానీ...అది విద్వేషపూరిత ప్రసంగంలా ఉండకూడదు. మరీ ముఖ్యంగా మతాన్ని కించపరిచి మాట్లాడకూడదు. మనోభావాలు దెబ్బ తీసేలా ఉండొద్దు" 


- మద్రాస్ హైకోర్టు 


ఉదయనిధిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ 


సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై ఇప్పటికే FIR నమోదైంది. ఆయన వ్యాఖ్యల్ని సమర్థిస్తూ...DMK ఎంపీ రాజాపైనా కేసు నమోదైంది. ఇప్పుడీ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. సనాతన ధర్మంపై ఈ ఇద్దరూ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. చెన్నైలోని ఓ లాయర్ ఈ పిటిషన్ వేశారు. వీరిపై FIR నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. DMK నేతలు మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా అలాంటి కార్యక్రమాలు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమని తేల్చి చెప్పారు. హిందూధర్మంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే వాళ్లకు బయట నుంచి ఏమైనా నిధులు వస్తున్నాయా అన్న కోణంలోనూ విచారణ జరపాలని పిటిషన్‌లో కోరారు లాయర్. LTTEతోనూ వీళ్లకు సంబంధాలు ఉన్నాయేమో అనుమానాలు కలుగుతున్నాయని, దీనిపైనా CBI విచారణ అవసరమని పిటిషన్‌లో ప్రస్తావించారు. వీలైనంత త్వరగా ఈ పిటిషన్‌ని విచారించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ ప్రత్యేకంగా కోరారు పిటిషనర్. అయితే..దీనిపై CJI చంద్రచూడ్ స్పందించారు. ప్రొసీజర్ ప్రకారమే పిటిషన్‌ల విచారణ చేపడతామని వెల్లడించారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా పెద్ద దుమారం రేగుతోంది. I.N.D.I.A కూటమిలోనూ ఈ వ్యాఖ్యలు విభేదాలకు దారి తీశాయి. 


Also Read: భార్యను బుద్ధుందా అని తిట్టినంత మాత్రాన వేధించినట్టు కాదు - బాంబే హైకోర్టు