Bombay High Court: 


బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు..


భార్యను బుద్ధుందా అని తిట్టినంత మాత్రాన ఆమెని వేధించినట్టు కాదని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ విడాకుల కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది. భర్త బూతులు తిడుతూ తనను వేధిస్తున్నాడని ఓ మహిళ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌లో మరాఠీ సామెతనీ కోట్ చేసింది. "Tula Akkal Nahi, Tu Yedi Ahes" అంటే...నీకు మెదడు లేదు, బుద్ధి లేదు అని అర్థం. ఈ సామెతనే పిటిషన్‌లో ప్రస్తావించిన ఆ మహిళ...తనను భర్త ఇలాంటి సూటి పోటి మాటలతో వేధిస్తున్నాడని కోర్టుకి చెప్పింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ నితిన్ సాంబ్రే, షర్మిలా దేశ్‌ముఖ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మాటలు అన్నంత మాత్రాన దాన్ని మానసికంగా వేధించినట్టు కాదని, అలా పరిగణించలేమని స్పష్టం చేశారు. ఇది వేధింపుల కిందకు రాదని తేల్చి చెప్పారు. ఈ మాటల్ని అందరూ చాలా సాధారణంగా మాట్లాడుతుంటారని, వాటిని అసభ్యపదజాలంగా పరిగణించడానికి వీల్లేదని అన్నారు. పిటిషన్‌లో మాత్రం ఆ మహిళ భర్తపై చాలా ఆరోపణలు చేసింది. తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని చెప్పింది. అర్ధరాత్రి ఇంటికి వస్తున్నాడని,బయటకు వెళ్దామని అడిగితే అరుస్తున్నాడని పిటిషన్‌లో పేర్కొంది. అయితే...కోర్టు మాత్రం ఆమె పిటిషన్‌లో క్లారిటీ లేదని చెప్పింది. ఆమె భర్త ఎలాంటి సందర్భంలో ఆ మాటలు అన్నాడో సరిగ్గా చెప్పడం లేదని, అలాంటప్పుడు అవి అసభ్యకరం అని ఎలా చెప్పగలమని ప్రశ్నించింది. 


ఇదీ జరిగింది..


2007లో ఈ జంట పెళ్లి చేసుకుంది. పెళ్లైన కొన్ని రోజులకే ఇద్దరి మధ్యా గొడవలు మొదలయ్యాయి. భర్త తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు ఆ మహిళ అంగీకరించలేదు. ఈ విషయంలో విభేదాలొచ్చాయి. తన తల్లిదండ్రుల్ని ఆమె సరిగ్గా చూసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశాడు భర్త. చివరకు ఈ గొడవ కోర్టుకెక్కింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి 2012లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశాడు. 2013లో తనపై భార్య ఫిర్యాదు చేసిందని, ఆ FIR కాపీని కోర్టులో సబ్మిట్ చేశాడు. 2009 నుంచే డైవర్స్ కోసం చూస్తున్నట్టు చెప్పాడు. ఈలోగా తనపై తప్పుడు కేసులు పెట్టి పరువు తీశారని కోర్టులో వివరించాడు. ఈ FIR కాపీని పరిశీలించిన కోర్టు...ఆమె కావాలనే తప్పుడు ఆరోపణలు చేసినట్టు తేల్చింది. ట్రయల్‌ నిర్వహించిన సమయంలో ఆమె ఏ విషయంలోనూ క్లారిటీ ఇవ్వలేదని చెప్పింది. 


కేరళ కోర్టు ఇలా..


ఓ కేసు విచారణలో కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు అమ్మ చేతి వంటే తినిపించాలని, ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు చేసుకునే అలవాటు మానుకోవాలని సూచించింది. పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసు విచారణలో ఈ సూచనలు చేసింది. తల్లిదండ్రులు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్లు పెట్టడం ఆపేసి పిల్లలకు తమ చేతి వంట రుచి చూపించాలని చెప్పింది. రోడ్డు పక్కనే ఓ వ్యక్తి అసభ్యకర వీడియోలు చూస్తుండగా పోలీసులు అతడిని గమనించి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అలాంటి వీడియోలు ప్రైవేట్‌గా చూస్తే తప్పేం కాదని తేల్చి చెప్పింది. ఇదే క్రమంలో పిల్లలకు మొబైల్ ఫోన్స్ అలవాటు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వాళ్లు బయట ఆడుకునేలా చూడాలని, అమ్మ చేతి కమ్మనైన వంట రుచి చూసేలా అలవాటు చేయాలని తెలిపింది. జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. 


Also Read: ఒకే దేశం ఒకే ఎన్నికపై స్పీడ్ పెంచిన కేంద్రం, సెప్టెంబర్ 23న తొలిభేటీ