Karnataka Politics: 


15 మంది చేరిక..


లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. I.N.D.I.A పేరిట ఇప్పటికే 26 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. మోదీ సర్కార్‌ని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన జోష్‌తో ఉన్న కాంగ్రెస్..ఈ కూటమిని లీడ్ చేస్తోంది. ఇప్పుడిదే కర్ణాటకలో ఆ పార్టీకి మరింత ఊపునిచ్చే పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకుంటోంది JDS. ఇలాంటి సమయంలో JDSకి చెందిన 15 మంది నేతలు కాంగ్రెస్‌లో చేరి షాక్ ఇచ్చారు. వీరిలో కీలకమైన నేతలూ ఉన్నారు. కర్ణాటక డిప్యుటీ సీఎం శివకుమార్ సమక్షంలో వీళ్లంతా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బెంగళూరు పార్టీ కార్యాలయంలో భారత్ జోడో ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. డీకే శివకుమార్ పార్టీలో చేరిన వాళ్లకు జెండాలు అందించారు. కీలక నియోజకవర్గాల్లోని ప్రతిపక్ష నేతల్ని క్రమంగా తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది కాంగ్రెస్. బీజేపీలో ఆ నేతలకు సరైన గౌరవం దక్కలేదని, అందుకే వాళ్లు కాంగ్రెస్‌లో చేరారని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. ఆ పార్టీ నచ్చకే కాంగ్రెస్‌లోకి వస్తున్నట్టు స్పష్టం చేశారు. 


"బీజేపీ, జేడీఎస్ నేతలకు ఆయా పార్టీల్లో సరైన గౌరవం లేదు. వాళ్లకు దక్కాల్సిన ప్రాధాన్యతా దక్కడం లేదు. అందుకే వాళ్లు విసిగిపోయారు. కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కర్ణాటకలో 20కి పైగా లోక్‌సభ సీట్‌లను గెలిచి తీరుతాం. బీజేపీ, జేడీఎస్‌కి చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలు మాతో సంప్రదింపులు జరుపుతున్నారు. అంతా ఓకే అయితే వాళ్లు కూడా కాంగ్రెస్‌లో చేరిపోతారు. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన నేతల్ని బీజేపీ తమ వైపు లాక్కుని అధికార దుర్వినియోగం చేసింది. కర్ణాటకలో గతంలో ప్రభుత్వానే కూలగొట్టింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవాలోనూ ఇదే జరిగింది"


- డీకే శివకుమార్, కర్ణాటక డిప్యుటీ సీఎం







లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు డీకే శివకుమార్. జేడీఎస్, బీజేపీ కలిసి పోటీ చేయడంపైనా స్పందించారు. బీజేపీకి కర్ణాటకలో క్యాడర్‌ లేదని, అందుకే వెన్నుపోటు పొడిచిన జేడీఎస్‌తోనే మళ్లీ కలుస్తోందని విమర్శించారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఘోరంగా దెబ్బతినడంతో.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు నిజమయ్యాయి. బీజేపీ, జేడీఎస్ కలిసే పోటీ చేస్తాయని కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారం నిజం అయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలిసే పోటీ చేస్తాయని మాజీ ముఖ్యమంత్రి కాషాయ పార్టీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప స్పష్టం చేశారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్‌ షాను.. జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ కలిసిన విషయం తెలిసిందే. రెండు పార్టీల పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. 2023 లోక్‌సభ ఎన్నికల్లో 5 స్థానాలు కేటాయించాలని జేడీఎస్ ప్రతిపాదించగా.. చర్చల అనంతరం 4 స్థానాలకు పరిమితం అయ్యారు. ప్రధాని మోదీ, దేవెగౌడ ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు సీట్లను ఖరారు చేశారని కర్ణాటక యడియూరప్ప అన్నారు. 


Also Read: మతం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, సనాతన ధర్మ వివాదంపై మద్రాస్ హైకోర్టు