ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించాలని సోనియాగాంధీ దాదాపుగా నిర్ణయానికి వచ్చారు. ఆయనను పిలిపించి హైకమాండ్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంలో కిరణ్‌కుమార్ రెడ్డి మరీ అంత ఆసక్తిగా లేరని చెబుతున్నారు. అందుకే ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. కిరణ్ పీసీసీ చీఫ్ అనే సరికి ఏపీలో రకరకాల చర్చలు ప్రారంభమయ్యాయి. ఏపీలో కాంగ్రెస్ దుస్థితికి ఆయనే ప్రధాన కారణం అని ఓ వర్గం ఆరోపిస్తోంది. మరో వర్గం మాత్రం మంచి చాయిస్ అంటోంది. ఎవరి విశ్లేషణలు ఎలా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అంతో ఇంతో పుంజుకోవడానికి కిరణ్‌కు మంచిన చాయిస్ లేదని భావిస్తున్నారు. 



కాంగ్రెస్‌లో చేరినా క్రియాశీల రాజకీయాలకు దూరంగా కిరణ్ !


 
ఊమెన్ చాందీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్చార్జ్ గా వచ్చిన తర్వాత పాత కాంగ్రెస్ నేతలందర్నీ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీని మళ్లీ క్రియాశీలం చేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో ఆయన ప్రయత్నాల వల్ల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. నిజానికి ఆయన సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత  రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా అదే పరిస్థితి.  తెలంగాణ ఉద్యమం సమయంలో యూపీఏ రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు సమైక్యాంధ్ర ప్రదేశ్ కోసం గట్టిగా నిలబడిన నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన జైసమైక్యంధ్ర పార్టీ పెట్టుకున్నా ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఏపీ కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు సమైక్యాంధ్ర అనడం వల్లనే ఎక్కువ నష్టం జరిగిందని.. ఆయన వల్లే కాంగ్రెస్ నాశనం అయిందని కొందరు ఆరోపించేవారు. దానికి సాక్ష్యంగా తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత  జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడాన్ని చూపిస్తున్నారు. అయితే అప్పట్లో నష్టం చేసినా ఇప్పుడు మళ్లీ కిరణే పార్టీని నిలబెడతారన్న నమ్మకం హైకమాండ్‌లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయనను ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమించేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. 


కిరణ్ కుమార్ రెడ్డి యాక్టివ్ అయితే కాంగ్రెస్ బలపడుతుందా ?
    


కిరణ్ కుమార్ రెడ్డి నాయకుడిగా గుర్తింపు పొందారు కానీ విడిగా ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకుడు కాదన్న అభిప్రాయం  ఉంది.   ఓ పొలిటికల్ బేస్ కానీ రాష్ట్ర వ్యాప్త అనుచరగణం కానీ ఆయనకు అగ్ర నేతల స్థాయిలో లేదని చెబుతారు.  దానికి సమైక్యాంధ్ర పార్టీకి వచ్చిన ఓట్లే సాక్ష్యంగా చెప్పుకోవచ్చు.  వచ్చే ఎన్నికలపై ఎలాంటి ఆశలు కాంగ్రెస్ పెట్టుకునే చాన్సే లేదు. కానీ పార్టీ పరిస్థితి మెరుగుపడుతుంది అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పాత కాంగ్రెస్ నేతలు కొంత మంది మళ్లీ పార్టీలోకి తిరిగి వచ్చారు. కొంత మంది పార్టీలోనే ఉన్నారు.  వ్యక్తిగత పలుకుబడి ఉన్న కొంత మంది నాయకుల్ని పార్లమెంట్ , అసెంబ్లీస్థానాల్లో అభ్యర్థులుగా నిలబెట్టి.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని గట్టిగా  ప్రచారం చేయగలిగితే.. ఓటు బ్యాంక్ పెంచుకునే అవకాశం ఉంటుందని హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ పీసీసీ చీఫ్‌గా చేసిన రఘువీరారెడ్డి.. ఇప్పుడు చీఫ్‌గా ఉన్న సాకే శైలజానాథ్ పార్టీని నడపలేకపోయారు. ఆర్థిక పరిస్థితులు.. ఇతర సమస్యలు కారణం కావొచ్చు. పార్టీ యాక్టివ్ కావాలటే కిరణే కరెక్టని ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. 


కాంగ్రెస్‌ తమకేది లాభమో చూసుకుంటుంది కానీ ఇతరులకు నష్టమని లెక్కలేసుకోదుగా !?


ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున రెడ్డి సామాజికవర్గంలో అంతో ఇంతో గుర్తింపు ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తే వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందని .. అందుకే ఆయనను నియమిస్తున్నారన్న అభిప్రాయం కూడా వినిపించే అవకాశం ఉంది. నిజానికి రాజకీయ పార్టీలు తాము బలపడాలని నిర్ణయాలు తీసుకుంటాయి. తాము బలపడాలంటే ఇతర పార్టీలు బలహీనపడాలి.  సహజంగానే కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో మొదటి టార్గెట్ వైఎస్ఆర్‌సీపీనే ఉంటుంది. ఎందుకంటే ఏపీలో వైఎస్ఆర్‌సీపీ  బలం.. బలగం.. ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీవే. బలమైన నాయకత్వం ఉంటే... వైఎస్ఆర్‌సీపీకి  మళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు  తిరిగి కాంగ్రెస్ కు వస్తాయని నమ్ముతున్నారు. హైకమాండ్ కూడా ఇదే నమ్ముతోంది. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ తీరు వల్ల చాలా మంది అసంతృప్తితో ఉన్నారని.. రెడ్డి సామాజికవర్గంకూడా అంతగా సంతోషంగా లేరని.. వారిలో కొంత మందిని పార్టీ  వైపు లాగితే కాంగ్రెస్‌కు ఫ్యూచర్ ఉంటుందని నమ్ముతున్నారు. అందుకే ఆ దిశగా కిరణ్‌ను చాయిస్‌గా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. 


ఇంతకూ కిరణ్ రెడీగా ఉన్నారా ?


కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఆయన పీలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం. తమ్ముడు టీడీపీలో చేరడం కిరణ్ కు ఇష్టం లేదని.. అందుకే ఆయన ఇంటికి కూడా పోవడం లేదని చెబుతున్నారు. అయితే అదే సమయంలో కిరణ్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావడం లేదు. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టలేదు. ఆయన తెర వెనుక రాజకీయాలకే పరిమితమవుతున్నారని.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఆసక్తి లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇప్పుడు రంగంలోకి దిగాల్సిన పరిస్థితిని హైకమాండ్ ఆయనకు వివరిస్తోంది. ఒత్తిడి తెస్తోంది. అంగీకరిస్తారా లేదా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. అయితే బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని చాందీ, మొయ్యప్పన్‌ వంటి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. మరి కిరణ్ రెడీ అవుతారా ? అయితే ఏపీలో కాంగ్రెస్ రాజకీయం మారుతుందా ? ఏపీ రాజకీయాల్లో ఏదైనా మార్పు వస్తుందా ? జాతీయ పార్టీకి మంచి రోజులు వస్తాయా అన్నది వేచి చూడాల్సిందే.