Vijayawada: విజయవాడ ఏసీబీ కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ కేసులో కోర్టుకు సీఐడీ సమర్పించిన రిమాండ్‌ రిపోర్టుపై వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి. 


ఏసీబీ  కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందోనని ప్రజలు టీవీలు, మొబైల్‌ ఫోన్లకు అతుక్కు పోయారు. మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు అన్నారు. ఆపై సాయంత్రం 5.30 గంటలకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు రానుందని ప్రచారం జరిగింది. కానీ తీర్పు ఇంకా వెల్లడించలేదు. చంద్రబాబు కేసులో తీర్పు రానున్న క్రమంలో విజయవాడలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది.  భారీగా మోహరించిన పారా మిలటరీ బలగాలను మొహరించారు. కోర్టు ప్రాంగణం నుంచి సుమారు 3 కిలో మీటర్ల మేరకు పోలీసులు తమ అధీనం లోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.


విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.  ఈ క్రమంలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకుంటున్నారు. ఏసీబీ కోర్టులోవిజయవాడ ఎంపి కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరాతీశారు. తాజా పరస్థితులపై చర్చించారు. చంద్రబాబుకు అనుకూలంగానే తీర్పు వస్తుందని న్యాయవాదులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  చంద్రబాబుకు బెయిలా, జైలా మరి కొద్ది సేపట్లో తేలనుంది. దీంతో ఏసీబీ కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం తీర్పునకు సంబంధించిన వివరాలతో కూడిన కాపీని సిద్ధం చేసేపనిలో కోర్టు సిబ్బంది ఉంది. మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది.