TDP Protest: చంద్రబాబు అరెస్ట్‌‌పై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ రెండో రోజు నిరసనలు చేపట్టారు. చాలా చోట్ల టీడీపీ నేతలు బయటకు రాకుండా పోలీసులు గృహనిర్బంధం చేశారు. విశాఖ జిల్లా వెన్నెలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును గృహనిర్బంధం చేశారు. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, ఆ పార్టీ కార్పొరేటర్ల నివాసాలను వద్ద పోలీసులు మోహరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ను బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. విజయవాడలో కొల్లు రవీంద్ర అరెస్ట్ చేశారు. గుణదల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


కన్నా లక్ష్మీ నారాయణ హౌస్ అరెస్టు
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గుంటూరులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటి నుంచి బయటకు రాకుండా గృహనిర్బంధం చేశారు. నెల్లూరు నగరంలో పలు రోడ్లను బారికేడ్లతో పోలీసుల దిగ్బంధించారు. మాగుంట లేఔట్‌లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నివాసం వద్దకు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో చుట్టపక్కల రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే నివాసంలో రోజువారీ విధులు నిర్వహించే సిబ్బంది, పనివారిని కూడా బారికేడ్ల అవతలే పోలీసులు నిలిపివేశారు.


ఒంగోలులో సామూహిక నిరాహార దీక్షలు
ఒంగోలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. పోలీస్ వలయాన్ని చేధించుకుని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు సామూహిక నిరాహార దీక్షకు చేరుకున్నారు. చంద్రబాబును తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనిగిరి టీడీపీ పార్టీ ఇంఛార్జి ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద చేపట్టిన నిర్వాహర దీక్ష ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ కార్యాలయానికి పోలీసులు తాళం వేశారు. దీంతో ఆ పార్టీ నేతలు పోలీసులతో గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టాయి. నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు, టీడీపీ నాయకులను పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. టీడీపీ కార్యాలయం వద్దకు ఆ పార్టీ కార్యకర్తలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. 


భారీగా పోలీసుల మోహరింపు
మార్కాపురం పట్టణంలో టీడీపీ నాయకులు తలపెట్టిన సామూహిక దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించారు. గిద్దలూరులో మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి సింగు సుధాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నందిగామ పట్టణం కాకాని నగర్‌లో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదివారం  చేపట్టిన సామూహిక నిరాహార దీక్షను అడ్డుకున్నారు. దీంతో ఆమె పార్టీ కార్యాలయంలోనే నల్ల బ్యాడ్జీలు, ఫ్ల కార్డులను పట్టుకొని నిరసన తెలిపారు.


సెల్ టవర్ ఎక్కిన టీడీపీ కార్యకర్త
సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మైదుగోళం గ్రామంలో టీడీపీ కార్యకర్త మంజునాథ్ సెల్ టవర్ మీదకు ఎక్కాడు.  పోలీసులు అతనికి నచ్చజెప్పి కిందకు దించారు. పోలీస్ స్టేషన్ తరలించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో టీడీపీ నేతల దీక్షా శిబరాలను పోలీసులు తొలగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.  చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని, పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం ఐలాండ్ సెంటర్‌లోని  అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు ధర్నా చేపట్టారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో టీడీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సీఎం జగన్ కి వ్యతిరేకంగా ధర్నా చేశారు.