Karnataka Election Result 2023: అనుకున్నట్టుగానే  కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకుంది. తాము మళ్లీ గెలుస్తామని ఎన్నో అంచనాలు పెట్టుకున్న బీజేపీకి నిరాశే ఎదురైంది. అయితే కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ ఆశలకు గండి కొట్టింది మాత్రం కచ్చితంగా లింగాయత్‌లే.


లింగాయత్ ప్రభావం ఉన్న స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం


కర్ణాటకలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా లింగాయత్‌లపైనే అందరి చూపు ఉంటుంది. ఆ స్థాయిలో వారు కన్నడ నాట నిర్ణయాత్మక శక్తిగా ఎదిగారు. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని ముంబై కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాల్లో లింగాయత్‌లే డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ ఏరియాలోని 13 జిల్లాల్లో దాదాపు 90 నియోజకవర్గాలలోని గెలుపు ఓటములను సాధించేది వారే. అయితే గత 20 ఏళ్లుగా వారు బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా బిజేపి వారి మద్దతుతోనే 52సీట్లను గెలుచుకుంది. 



గత కొన్నేళ్లుగా లింగాయత్‌లలో పలుకుబడి ఉన్న యడ్యూరప్పను బీజేపీ అగ్రనేతలు చిన్న చూపు చూస్తున్నారని..తమను అవమానిస్తున్నారనే అభిప్రాయం వారిలో ఏర్పడింది. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ కూడా చివరి క్షణంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వీర శైవ లింగాయత్ ఫోరం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతున్నట్టు లేఖ విడుదల చేసింది. దీంతో కంగుతిన్న బీజీపీ నేతలు వారిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. తమకు ఎప్పటి నుంచో ఆండగా ఉన్న ఉత్తర కర్ణాటక ప్రాంతంలో సీట్లను గెలుచుకోవడంలో బీజేపీ వెనక పడింది. 
రాష్ట్ర జనాభాలో 17శాతం వరకూ ఉన్న లింగాయత్‌లకే సీఎం పదవి ఇస్తామనే హామీని బీజేపీ నాయకత్వం ఇవ్వలేకపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాతే సీఎం ఎవరనేది చెబుతామనడం కూడా ఆ సామాజిక వర్గం కాంగ్రెస్‌కు మద్దతు పలకడానికి కారణమైంది అంటున్నారు ఎనలిస్ట్‌లు



లింగాయత్‌ల రేంజ్‌లో ఏపీలో కాపులు ప్రభావం చూపగలరా?


సరిగ్గా కర్ణాటక ఎన్నికల్లో లింగాయత్‌లు చూపే ప్రభావమే ఏపీలో కాపులు కూడా చూపిస్తూ ఉంటారు. వారి లాగే కాపులు దాని అనుబంధ వర్గాల జనాభా కూడా 18శాతం పైనే ఉంటుంది అని గణాంకాలు చెబుతున్నాయి. అయితే వారు ఎప్పటి నుంచో కోరుకుంటున్న సీఎం సీట్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఉమ్మడి ఆంధ్రలో ప్రజారాజ్యం ప్రయోగం విఫలం అయ్యాక వారి డిమాండ్ మరింత పెరిగింది. 



రాష్ట్ర విభజన తరువాత వారు జనసెన వైపు చూసినా 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చెయ్యక పోవడంతో వారు టీడీపీకి మద్దతు పలికారు. కానీ వారికి రిజర్వేషన్ కల్పిస్తానన్న చంద్రబాబు ఎన్నికల ముందు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసినా దాన్ని కేంద్రం తోసి పుచ్చింది. దాంతో 2019 ఎన్నికల్లో కాపులు జగన్‌కు అండగా నిలబడ్డారు. గోదావరి జిల్లాల్లోని 34 నియోజక వర్గాల్లో మెజారిటీ సీట్లను వైసీపీ గెలుచుకోవడంలో వారిదే కీలక పాత్ర. దానితో వారిని మంచి చేసుకోవడానికి సీఎం జగన్ కాపు నేస్తం.. ఓబీసీ ఆత్మీయ సమ్మేళనం వంటి కార్యక్రమాలు తెరపైకి తీసుకొచ్చారు.



కాపులకు సీఎం సీటు అనేది తమకు తీరని కలగా ఉండడంతోపాటు దశాబ్దాల తరబడి తాము అన్యాయానికి గురవుతున్నామనే భావన కాపులలో బలంగా ఉంది. జనసేన అధినేత పవన్ కూడా కాపులకు అండగా ఉంటాననే హామీకి బదులు తనకు ఓట్లు వెయ్యలేదనే నిష్టూరాలు వారిని అయోమయానికి గురిచేస్తున్నాయి అంటారు కొందరు విశ్లేషకులు. మళ్లీ పొత్తులు ఉంటాయని ఆయన చెప్పడం... సీఎం సీటుపై తనకు ఆశలేదని చెప్పడం కూడా కాస్త గందరగోళానికి తెర తీస్తోంది. 


పవన్ తీసుకున్న ఈ స్టెప్‌తో ఇప్పుడు కాపులు మరోసారి మూడు రోడ్ల జంక్షన్‌లో నిల్చొని ఉన్నారు. ఆఖరి నిమిషంలో ఎవరికి జై కొడతారో అన్న ఉత్కంఠను కొనసాగిస్తున్నారు. ఒకరి విజయానికి దోహదపడతామో లేదో తెలియదు కానీ.. తాము ప్రత్యర్థులుగా అనుకునే వారిని ఓడించడానికి మాత్రం ముందుంటామని కొందరు కాపు నేతలు అంటున్నారు. అందుకు 2019 ఎన్నిలను ఉదాహరణగా చెబుతున్నారు. తమకు అండగా ఉండడంతోపాటు సరైన ప్రాతినిధ్యం కల్పించే వారికే మద్దతు పలకాలని డిసైడ్ అయినట్లు కాపు సామాజిక వర్గ నేతల అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే కర్ణాటక ఎన్నికల్లో లింగాయత్‌లు పోషించిన పాత్రే ఏపీ ఎన్నికల్లో కాపులు పోషించడం ఖాయమంటూ ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు ఎనలిస్ట్‌లు.