అధికారం పార్టీ నేతలైతే ఏమైనా చేయొచ్చన్న ధీమానో..? లేక తమ అభిమాన నాయకుడి మీద ఎనలేని అభిమానమో..? ఏది ఏమైనా... కాకినాడలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  నేతలు చేసిన పని మాత్రం విమర్శలకు తావిచ్చింది. సీఎం జగన్‌ ఫ్లెక్సీకి అడ్డుగా ఉందని ట్రాఫిక్‌ లైట్‌నే తొలగించేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు. ట్రాఫిక్‌ లైట్‌ కంటే తమ  నాయకుడికి ఫ్లెక్సీనే ముఖ్యం అనుకుని ఉంటారు. తమను ఎవరు అడుగుతారులే అనుకుని ట్రాఫిక్‌ లైట్‌ను తొలగించేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  ఇంకేముందు... ఇది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల తీరు అంటూ ఏకిపారేస్తున్నాయి ప్రతిపక్షాలు.


కాకినాడలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బస్సు యాత్ర సందర్భంగా... ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించే సభ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌మోహన్‌రెట్టి ఫ్లెక్సీ కట్టారు. అయితే... అక్కడ ట్రాఫిక్‌ సిగ్నల్‌ అడ్డంగా ఉండటం వల్ల సీఎం జగన్‌ ఫ్లెక్సీ సరిగా కనిపించలేదు. దీంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు... ఎంచక్కా ట్రాఫిక్‌ సిగ్నల్‌ను ఊడదీశారు. సీఎం జగన్‌ ఫ్లెక్సీ స్పష్టంగా కనిపిచేలా చూసుకున్నారు. 


కాకినాడ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల నిర్వాకం.. వివాదాస్పదమైంది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ కంటే... సీఎం జగన్‌ ఫ్లెక్సీనే ఎక్కువైపోయిందా అంటూ ప్రతిపక్ష పార్టీలు సోషల్‌ మీడియా  వేదికగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ట్రాఫిక్ సిగ్నల్‌ది ఏముంది ఫ్లెక్సీనే ఇంపార్టెంట్ కదా.... అంటూ సెటైర్లు కూడా వేసేస్తున్నారు. దీనికి వైఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు,  సీఎం జగన్ అభిమానులు గట్టి కౌంటర్‌ ఇస్తున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ తీసిపడేయలేదని... కొంచెం సేపు పక్కన పెట్టి.. తర్వాత మళ్లీ అదే స్థానంలో ఉంచారని సమాధానం  ఇస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా... వైరల్‌ అవుతున్న వీడియోలో... ట్రాఫిక్‌ సిగ్నల్‌ ఊడదీసి పడేయడమే కనిపిస్తోంది కదా. ఆ వీడియోని వైరల్‌ చేస్తూ... ఇది వైఆర్‌ఎస్‌సీపీ  నేతల అరాచకం అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి టీడీపీ, జనసేన పార్టీలు. అధికారం అండంతో... ఎంతకైనా తెగిస్తారు.. ఏమైనా చేస్తారు అంటూ ఆరోపిస్తున్నాయి.


ట్రాఫిక్‌ సిగ్నల్‌ తీసిపారేయడమే కాదు... కాకినాడలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బస్సు యాత్ర సందర్భంగా... అక్కడి ప్రజలకు చుక్కలు చూపించారని ప్రతిపక్షాలు  విమర్శిస్తున్నాయి. బస్సు యాత్ర కోసం... కాకనాడలో కొన్ని రోడ్లు మూసేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వైఎస్ఆర్‌సీపీ బస్సు యాత్ర సాగే కూడళ్ల దగ్గర బారికేడ్లు ఏర్పాటు  చేసి... ఆ మార్గంలోకి వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాకినాడ ప్రజలకు తిప్పలు తప్పలేదని అంటున్నారు.