MLC Kavitha: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికలను ఆసక్తికరంగా మారుస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులపై క్రెడిట్లు తీసుకోవడానికి అన్ని పార్టీల నేతలు పోటీ పడుతున్నారు. తాజాగా తెలంగాణలో పవర్ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మధ్య ట్వీట్ వార్ జరిగింది.
కిషన్ రెడ్డి ఏమన్నారంటే
తెలంగాణలో నిరంతర విద్యుత్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తెలంగాణలో నిరంతర విద్యుత్ సరఫరాకు మోదీ ప్రభుత్వం భరోసా కల్పిస్తోందన్నారు. భారతదేశంలోనే అత్యంత హైటెక్, అదునాత ఎన్‌టీపీసీ థర్మల్ ప్లాంట్‌ను కేంద్రం పెద్దపల్లి జిల్లాలో స్థాపించిందని అన్నారు. మొదటి దశ పనులను భారీ బడ్జెట్‌తో చేపట్టినట్లు చెప్పారు. రూ.6 వేల కోట్లతో 800 మెగావాట్ల సామర్థ్యంతో మొదటి దశ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని వెల్లడించారు. ఇది విద్యుత్ సరఫరా పరిస్థితిని మెరుగుపరుస్తుందని, తెలంగాణ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని ట్వీట్ చేశారు.
కవిత కౌంటర్
తెలంగాణలో కరెంట్ గురించి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. కరెంటు సరఫరాపై కట్టు కథలు చెప్పడం మానేయాలని కిషన్ రెడ్డికి సూచించారు. తెలంగాణ విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉంటే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుందని కవిత తెలిపారు. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్తులో పెద్దపల్లి ఎన్టీసీపీ నుంచి వస్తున్నది కేవలం నాలుగు శాతం మాత్రమేనని స్పష్టం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్తును అందజేస్తుందంటూ అబద్దాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు.
సీఎం కేసీఆర్ కృషి వల్లనే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని అన్నారు. విద్యుత్తు లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకువచ్చిన ఘనత కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.