KA Paul: తెలుగు రాష్ట్రాల మీద భారతీయ జనతా పార్టీ (BJP) కుట్రలకు తెరతీసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల కిందట ఎవ్వరికీ తెలియకుండా ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రుడు అయిన అదానీకి వెయ్యి కోట్లు విలువ చేసే స్టీల్ ప్లాంట్ భూమిని కేటాయించారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీ, గుజరాత్ గ్యాంగ్‌ను ఢీకొనలేకపోతున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని రాజకీయ నాయకులకు సత్తా లేదని మండిపడ్డారు. ప్రధాని మోదీకి తెలుగు నేతలు అమ్ముడు పోయి, తొత్తులుగా మారారని విమర్శించారు. తానే గనక ఎంపీనైతే గంగవరం పోర్ట్‌ను సీజ్ చేస్తామన్నారు. ఏపీ, తెలంగాణ నేతలు ఏకం కావాలని, అందరూ కలిసి తెలుగు సత్తా చూపిద్దామని పిలుపు నిచ్చారు. తాను ముందుండి పోరాటం నడిపస్తానని పాల్ వ్యాఖ్యానించారు. పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న ఘనత తెలంగాణ బిడ్డల సొంతం అన్నారు.
తెలుగు రాష్ట్రాల తరఫున తాను మాట్లాడుతుంటే గుజరాతీ గుండాలు తనను చంపుతామని బెదిరిస్తున్నారని పాల్ ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మతిస్థిమితం ఉందా అని ప్రశ్నించారు. మోదీతో పవన్ చేతులు కలిపి ఆయన కింద సాగిలపడ్డారని అన్నారు. పవన్‌కు ఏమాత్రం సత్తా, పౌరుషం ఉంటే తనతో చేతులు కలపాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నేతలు ఏకం అయ్యి కేంద్రానికి మన శక్తి ఏంటో చూపించాలన్నారు.
నాలుగు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ వెళ్లడానికి మోదీకి ధైర్యం లేకపోయిందని కేఏ పాల్ విమర్శించారు. కానీ చంద్రయాన్ విజయవంతం చేసిన శాస్త్రవేత్తలను అభినందించడానికి బెంగళూరు వెళ్లారని విమర్శించారు. ఏపీ ప్రజలు తనతో కలిసి నడవాలని, విశాఖ సత్తా ఏంటో కేంద్రానికి చూపిస్తానన్నారు. సోమవారం 28 నుంచి స్టీల్ పాయింట్ పరిరక్షణ కోసం తన ఫంక్షన్ హాల్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. ప్రజలు తన దీక్షకు మద్దతుగా నిలవాలని కోరారు.
జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్‌పై పాల్ ఆగ్రహం
ఇటీవల ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కాంట్రాక్టర్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. హైదరాబాద్ అమీర్ పేట్‌లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయం ముందు రోడ్డును తవ్వడం కేఏ పాల్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. రోడ్డును తవ్విన కాంట్రాక్టర్ పై ఒంటికాలుపై లేచారు. తాను నివాసం ఉంటున్న ఇంటి ముందు రోడ్డు తవ్వొద్దని చెప్తే ఎందుకు తవ్వారని ఆర్ అండ్ బి సిబ్బందిని కేఏ పాల్ నిలదీశారు.
‘‘ఇక్కడ రోడ్డు తవ్వవద్దని నీకు ఇంజినీర్లు, మేయర్ చెప్పారు కదా? ఎందుకు తవ్వావు? జస్ట్ గెట్ అవుట్, లేదంటే మేమే గెంటేస్తాం’’ అని కేఏ పాల్ ఆర్ అండ్ బీకి చెందిన ఓ వ్యక్తిపై అరిచారు. దీనికి ఆ వ్యక్తి కూడా దీటుగానే స్పందిస్తూ.. ‘‘ఫస్ట్ సరిగ్గా మాట్లాడండి. నా దగ్గర గవర్నమెంట్ ఆర్నమెంట్ ఉంది’’ అని ఆ వ్యక్తి చెప్పగా, ఇంజినీర్లు, మేయరే అక్కడ రోడ్డు తవ్వవద్దని నీ ముందే చెప్పారని కేఏ పాల్ గట్టిగా చెప్పారు.
అంతటితో ఆగకుండా కేఏ పాల్ మరో వ్యక్తితో వాదనకు దిగారు. ఒరేయ్.. కొడతాను నిన్ను.. కొడతాను.. ఇంజినీర్లు అందరూ వచ్చి చెప్పారు.. ఇక్కడ రోడ్డు తవ్వవద్దని. వారు చెప్పిన తర్వాత కూడా రోడ్డు తవ్వుతావా? ఇక్కడ 30 దాకా కార్లు ఉన్నాయి. అందుకే ఇక్కడ రోడ్డు తవ్వవద్దని మేం మేయర్ ని అడిగాం. అందుకు అంగీకరించారు’’ అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.