Khammam BRS: వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జిల్లా నేతలకు ప్రగతి భవన్ నుంచి పిలుపు రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్ఠానం ఉభయ జిల్లాల్లోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో తుమ్మల పేరు లేదు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తుమ్మల రాజకీయ పయనం ఎటువైపు ఉంటుందన్న చర్చ కూడా ఊపందుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు తేల్చి చెప్పడంతో.. ఆయన పార్టీ మార్పు స్పష్టమైంది. మరి ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు.. లేదా స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిల్చుంటారా.. అనే అంశాలపై ఊహాగానులు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ నేతలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు అందరూ వెంటనే ప్రగతి భవన్ కు రావాలని ఆదేశాలు అందాయి. సాయంత్రం ఖమ్మం బీఆర్ఎస్ నేతలతో సీఎం భేటీ కానున్నారు. ఈ సమావేశం తర్వాత సీఎం నుంచి ఎటువంటి ప్రకటన ఉంటుంది అన్నది బీఆర్ఎస్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


పోటీ చేస్తానని నిన్న ప్రకటించిన తుమ్మల


మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్తుపై కార్యాచరణను ప్రకటించారు. భారీ వాహన శ్రేణి నడుమ అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా ఆయన ఖమ్మం చేరుకున్న సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద శుక్రవారం ఉదయం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సుమారు వెయ్యి కార్లు, 2 వేల బైక్‌లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని తాను నిర్ణయించుకున్నట్లుగా తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం తన జీవితం మొత్తం అంకితం చేశానని అన్నారు. ఈ ఎన్నికలు తనకు పెద్దగా అవసరం లేదని.. తన రాజకీయం పదవి కోసం కాదని అన్నారు. తన జిల్లా ప్రజల కోసమే అని అన్నారు. ఖమ్మం జిల్లా వాసుల రాజకీయ రుణం తీర్చుకోలేనిదని అన్నారు. తాను ఏనాడూ ఎవరి ముందు తలవంచబోనని, అలాంటి పరిస్థితి వస్తే తన తల నరుక్కుంటానని అన్నారు.


Also Read: Praggnanandhaa Mother: ప్రజ్ఞానందను చూస్తూ మురిసిపోయిన తల్లి, వైరల్ అవుతున్న పిక్‌పై ఆమె ఏమన్నారంటే?


గోదావరి జలాలతో ప్రజల పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా గెలుస్తానని అన్నారు. కొంత మంది పరాన్నభుక్కులు కొన్ని ఎత్తులు వేయొచ్చని అన్నారు. ‘‘గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా. ఒక నేను రాజకీయాలలో ఉండబోనని సీఎం కేసీఆర్ కు కూడా చెప్పాను. కానీ, మీ ఆందోళన, అభిమానం చూశాక మనసు మార్చకున్నాను. నాగలి దున్నుకునే నన్ను ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశారు. గత మూడు ప్రభుత్వాలలో నాకు అవకాశం ఇచ్చారు. నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను కాపాడారు. అందుకే మీ కోసమే ఎన్నికల్లో నిలబడుతున్నా. నన్ను బీఆర్ఎస్ అధిష్ఠానం తప్పించిందని కొందరు శునకానందం పొందుతున్నారు. నేను ఎవరినీ నిందించను. నా శిరస్సు నరుక్కుంటా తప్ప.. నా కోసం ఎవరూ తలవంచొద్దు. నేను ఎక్కడా తలవంచేది లేదు. నన్ను మీ గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తారనే మీ ముందుకు వస్తున్నా’’ అని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.