Praggnanandhaa Mother: భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. అతి పిన్న వయస్సులోనే చదరంగంలో చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ రన్నరప్ గా నిలిచాడు. ఫైనల్ లో కార్ల్‌సన్‌ చేతిలో ఓడినప్పటికీ.. భారతీయులు గర్వపడేలా చేశాడు ఈ తమిళనాడు కుర్రాడు. చిన్న వయస్సులోనే కొడుకు సాధిస్తున్న విజయాలకు ప్రజ్ఞానంద తల్లి నాగలక్ష్మీ ఎంతో సంతోషిస్తున్నారు. చెస్ పోటీలకు ప్రజ్ఞానందతో పాటే వెళ్లే ఆమె.. తన వెంటే ఉంటూ తనకు భరోసా కల్పిస్తూ, తన విజయాల్లో పాలుపంచుకుంటున్నారు. అంతర్జాతీయ వేదికపై ప్రజ్ఞానంద కనబరుస్తున్న ప్రతిభను చూస్తూ మురిసిపోతూ తాజాగా కెమెరాకు చిక్కారు. ప్రజ్ఞానంద వేదికపై ఉండగా.. పక్కనే నిల్చొని ఉన్న నాగలక్ష్మీ.. తన కొడుకు వైపే చూస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


వైరల్ అవుతున్న తన పిక్ పై తాజాగా ఆమె స్పందించారు. ఆ సమయంలో తనలోని భావాలను, తను పొందిన అనుభూతిని, తనలోని ఆనందాన్ని, కొడుకు ఎదుగుతున్నప్పుడు ఒక తల్లిగా అనుభవించిన అద్వితీయమైన భావన గురించి చెప్పుకొచ్చారు. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్(భారత్ కు చెందిన అర్జున్ ఎరిగైసితో పోటీ) లో ప్రజ్ఞానంద ఎలాంటి ఆట తీరు కనబరుస్తాడో, ఎలా ఉండనుందో అని ఆలోచిస్తూ.. వేదికపై ఉన్న ప్రజ్ఞానందను చూస్తూ మురిసిపోతున్న సమయంలో నాగలక్ష్మీకి తెలియకుండా అక్కడే ఉన్న జర్నలిస్టులు ఆమెను ఫోటో తీశారు. ఆ తర్వాత ఆ పిక్ కాస్త వైరల్ గా మారింది. అలా తన వద్దకు చేరింది. దానిపై స్పందిస్తూ.. ఆ సమయంలో ప్రజ్ఞానందను చూడటంలో, అనుభూతి చెందడంలో లీనమైపోయినట్లు చెప్పారు. ఆ సమయంలో తనకు తెలియకుండానే ఎవరో ఫోటో తీశారని అన్నారు. 


ప్రజ్ఞానంద వయస్సు ప్రస్తుతం 18 సంవత్సరాలే. తాను ఇంకా ఎదగడానికి, మరెన్నో విజయాలు సాధించడానికి, చదరంగంలో మరిన్ని శిఖరాలు అధిరోహించడానికి, సాధించడానికి ఇంకా చాలా ఉందని నాగలక్ష్మి అన్నారు. ప్రపంచకప్ టోర్నీలో ఇంత దూరం రావడం తమకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బాకులో ప్రపంచకప్ పోటీల్లో పాల్గొన్న ప్రజ్ఞానంద.. అక్కడి నుంచి జర్మనీకి వెళ్తారని, అక్కడి నుంచి ఆగస్టు 30వ తేదీన దేశానికి తిరిగి వస్తారని ఆమె తెలిపారు. 


ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నుంచి తమ కుటుంబానికి పిలుపు రావడం ఎంతో సంతోషంగా అనిపించిందని నాగలక్ష్మీ తెలిపారు. సీఎం నుంచి ఫోన్ కాల్ రావడం ఆశ్చర్యకరంగా అనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్ ఫోన్ చేసే సమయానికి చాలా రాత్రి అయిందని, ఆ సమయంలోనూ సీఎం ఫోన్ చేసి ప్రజ్ఞానందను అభినందించారని నాగలక్ష్మీ తెలిపారు. ప్రజ్ఞానంద ఆటను చెన్నై నుంచే సీఎం స్టాలిన్ గమనిస్తున్నట్లు చెప్పడం చాలా బాగుందని నాగలక్ష్మీ వెల్లడించారు. 


Also Read: Paris Olympics: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా, పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత


గురువారం మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో జరిగిన ట్రైబ్రేక్‌లో ప్రజ్ఞానంద పోరాడి ఓడాడు. ర్యాపిడ్‌ రౌండ్‌లో మొదటి 25+10 గేమ్‌లో ఓటమి చవిచూశాడు. తెల్ల పావులతో రంగంలోకి దిగిన అతడు సమయం గడిచేకొద్దీ ఇబ్బంది పడ్డాడు. కార్ల్‌సన్‌ ఎత్తులకు పైఎత్తులు వేయలేకపోయాడు. దాంతో సమయం మించిపోయింది. సాధారణంగా తెల్ల పావులతో ఆడేటప్పుడు ప్రగ్గూ కొద్దిగా వెనుకంజ వేస్తాడు. ప్రత్యర్థిని ఉచ్చులో బిగించడానికి ఆలోచనలు రావని అతడే చెప్పాడు. టైబ్రేక్‌ మొదటి గేమ్‌ ఓడిపోవడంతో ప్రజ్ఞానందకు రెండో దాంట్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 18 ఏళ్ల కుర్రాడిపై ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆధిపత్య ఒత్తిడి కనిపించింది. తనకు బలమైన నల్లపావులతో ఆడుతుండటంతో ఏదైనా మ్యాజిక్‌ చేయకపోతాడా అని అభిమానులు ఆశించారు. మొదట్లో ప్రత్యర్థికి దీటుగా ఎత్తులు వేసినప్పటికీ ఐదు నిమిషాల తర్వాత అనూహ్యంగా ఒత్తిడిలోకి జారుకున్నాడు. పది నిమిషాలు ఉండగానే గేమ్‌ డ్రా చేసుకుంటానని మాగ్నస్‌ను కోరాడు. అతడూ అంగీకరించడంతో మ్యాచ్‌ ముగిసింది.