Paris Olympics: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేశాడు. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఈ వీరుడు.. వరల్డ్ అథ్లెటిక్స్ లోనూ సత్తా చాటుతున్నాడు. హంగేరీలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ క్వాలిఫయర్స్ తొలి ప్రయత్నంలోనే ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ఫైనల్ కు దూసుకెళ్లాడు. దాంతో పాటు 2024 లో పారిస్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ క్రీడా సంగ్రామానికి అర్హత సాధించాడు. హంగేరీలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ క్వాలిఫికేషన్ రౌండ్ లో నీరజ్ చోప్రా చెలరేగిపోయాడు. ఈ రౌండ్ లో నీరజ్ 88.77 మీటర్ల దూరం విసిరాడు. ఈ సీజన్ లో నీరజ్ చోప్రాకు ఇదే అత్యుత్తమం కావడం గమనార్హం. తొలి ప్రయత్నంలోనే నీరజ్ చోప్రా ఇంత దూరం జావెలిన్ ను విసిరాడు. ఫైనల్ కు చేరడానికి కటాఫ్ మార్కు 83 మీటర్లు కాగా.. దానిని అధిగమించడంతో పైనల్ కు చేరాడు. అలాగే పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించాలంటే 85.5 మీటర్ల దూరం జావెలిన్ ను విసరాల్సి ఉండగా.. నీరజ్ దానిని సులువుగా దానిని అధిగమించాడు.
2022లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ గెలవాలని నీరజ్ తీవ్రంగా శష్రమించాడు. అయితే అప్పుడు సిల్వర్ మెడల్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వరల్డ్ అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారతీయుడిగా నిలవాలని నీరజ్ ఈసారి చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. 2022 లో నీరజ్ సిల్వర్ మెడల్ గెలవగా.. భారత్ నుంచి వరల్డ్ ఛాంపియన్ షిప్ లో వెండి పతకం గెలవడం కూడా అదే తొలిసారి కావడం గమనార్హం. ఆ పోటీల్లో గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్ బంగారు పతకం గెలిచాడు.
ప్రస్తుతం వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రా 88.77 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరి రెండో స్థానంలో ఉన్నాడు. టోక్యో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్ జాకుబ్ వాద్లెచ్ 89.51 మీటర్లతో తొలి స్థానంలో ఉన్నాడు. ఈ పోటీల్లో నీరజ్ చోప్రాకు ప్రధాన పోటీ వాద్లెచ్ నుంచే ఎదురుకానుంది. ఈ పోటీల్లో జావెలిన్ త్రోలో ఎవరూ 90 మీటర్ల మార్క్ అందుకోలేదు. ఫైనల్ లో నీరజ్ చోప్రా ఆ మార్క్ ను అందుకుంటే గోల్డ్ మెడల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్, ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్, కామన్వెల్త్ గేమ్స్, డైమండ్ లీగ్ లోనూ నీరజ్ చోప్రా ఛాంపియన్ గా ఉన్నాడు. ఇప్పుడు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లోనూ బంగారు పతకం సాధించాలని ఉత్సాహంతో ఉన్నాడు నీరజ్ చోప్రా. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పైనల్ ఈ ఆదివారం (ఆగస్టు 27వ తేదీ) జరగనున్నాయి. పైనల్స్ లో 12 మంది పోటీ పడనున్నారు. వీరిలో ముగ్గురు భారతీయులు ఉండటం విశేషం. ఫైనల్స్ లో హెలాండర్, వాద్లెచ్, డేవిడ్ వాగ్నెర్, నీరజ్ చోప్రా, ఆడ్రియన్ మార్డరె, ఇహాబ్ అబ్దల్ రహ్మాన్, అర్షద్ నదీమ్, డీపీ మను, ఎడిస్ మటుసెవిస్, వెబర్, కిషోర్ జెనా, హెర్మన్ పోటీ పడబోతున్నారు.