దేశ రాజధాని ఢిల్లీలో జీ-20 సదస్సు జరగనున్నందున ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేశారు. సెప్టెంబరు 8 నుంచి 10 వరకూ జీ-20 సదస్సు జరగనున్నందున అంతకు ఒక రోజు ముందే ఆంక్షలు మొదలు అవుతాయని ఢిల్లీలో ట్రాఫిక్ విభాగం ప్రత్యేక సీపీ ఎస్ఎస్ యాదవ్ వివరించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన భారత్ మండపం కన్వెన్షన్ సెంటర్ లో సదస్సు జరగనుంది. సెప్టెంబరు 7 రాత్రి నుంచి సెప్టెంబరు 10 వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.


ఆంక్షల్లో భాగంగా న్యూఢిల్లీ ప్రాంతంలో నివాసం ఉండేవారు ఆ పరిధిలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ, చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చిన వారు లేదా టూరిస్టులు న్యూఢిల్లీ పరిధిలోకి రావాలంటే హోటల్ బుకింగ్స్ కి సంబంధించిన ప్రూఫ్ చూపించాలని వివరించారు. అంతేకాక, ప్రజలు సెప్టెంబరు 8, 9, 10 తేదీల్లో మార్కెట్లకు, దుకాణాలకు వెళ్లొద్దని సూచించారు.


అంతేకాక, న్యూఢిల్లీలోకి వచ్చే కార్గో ట్రక్కులను కూడా నగరం బయటి నుంచే మూడు రోజులపాటు మళ్లించనున్నారు. అత్యవసర వస్తువులను రవాణా చేసే కార్గో ట్రక్కులను మాత్రం అనుమతించనున్నారు. 


అంబులెన్సులు, అత్యవసర సేవల విషయంలో ఈ ఆంక్షలు వర్తించవని పోలీసులు తెలిపారు. మథుర రోడ్, భైరాన్ మార్గ్, పురాణా కిలా రోడ్ ట్రాఫిక్ రద్దీ వల్ల మూసేస్తామని చెప్పారు. కేవలం అంబులెన్స్‌లు, బస్సులు మాత్రమే న్యూ ఢిల్లీ ఏరియాలోకి అనుమతిస్తామన్నారు. అన్ని షాపింగ్ మాల్స్ మూసి ఉంటాయని తెలిపారు. 


ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లకు వెళ్లాలనుకునే వారు ఆ మూడు రోజుల్లో ముందుగానే బయలుదేరాలని చెప్పారు. ఇలాంటి ముఖ్యమైన పనులపై వెళ్లేవారు మెట్రో సర్వీసులను ఉపయోగించాలని కోరారు. మెట్రో రైళ్ల సర్వీసుల్లో ఎలాంటి ఆటంకం ఉండబోదని అన్నారు. కానీ, న్యూ ఢిల్లీ ఏరియాలో ఉన్న సుప్రీంకోర్టు, ఖాన్ మార్కెట్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లు మాత్రం మూడు రోజులు మూసి ఉంచే అవకాశం ఉందని అన్నారు. ఆంక్షల వేళ అత్యవసర సేవల సిబ్బందికి సాయం అందించడం కోసం వర్చువల్ హెల్ప్ డెస్క్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.


జీ-20 సదస్సులో భాగంగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, చైనా ప్రెసిడెంట్ షీ జిన్ పింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తదితర దిగ్గజ దేశాధినేతలు జీ-20 సదస్సుకి హాజరుకానున్నారు. వీరంతా సెప్టెంబరు 9న ఇండియాకి రానున్నారు. ఆ తర్వాతి రోజు గాలా డిన్నర్ ఉండనుంది. సెప్టెంబరు 10న వీరు రాజ్ ఘాట్ ను సందర్శించనున్నారు.