BRICS Summit 2023: దక్షిణాఫ్రికా జోహెన్నస్‌బెర్గ్‌లో బ్రిక్స్ శిఖాగ్ర సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సు అనంతరం వివిధ దేశాధినేతలతో సమావేశం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఆయా నేతలకు మన దేశానికి చెందిన వివిధ కళాకృతులను, కళాఖండాలను బహుమతిగా అందించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసాతో భేటీ అయిన ప్రధాని.. ఈ సందర్భంగా మన దేశానికి చెందిన పురాతన, చారిత్రక కళాఖండాలను బహుకరించారు. తెలంగాణకు చెందిన బిద్రి పూస అలాగే నాగాలాండ్ శాలువా, గోండ్ పెయింట్స్ నను బహుమతిగా ఇచ్చారు.


తెలంగాణకు చెందిన బిద్రి కళాఖండం సురాహిని బహుమతిగా అందించారు. ఈ బిద్రి సురాహినికి 500 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. మొదట్లో బీదర్ కు మాత్రమే పరిమితం అయిన ఈ బిద్రి కళా.. అనంతరం తెలంగాణకు కూడా విస్తరించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ కళ వృద్ధి చెందింది. బిద్రి వాస్.. జింక్, రాగి, ఇతర నాన్ ఫెర్రస్ లోహాల మిశ్రమంతో తయారు చేస్తారు. కాస్టింగ్ పై అందమైన నమూనాలను చెక్కుతారు. స్వచ్ఛమైన సిల్వర్ వైర్ తో అల్లుతారు. ప్రత్యేక ఆకర్షణగా ఉండే బీదర్ లో లభించే ప్రత్యేకమైన మట్టిలో లోహపు ద్రావణాలు కలిపి దీనిని తయారు చేస్తారు. బిద్రి పాత్రలపై ఆకట్టుకునేలా అందమైన డిజైనన్లు రూపొందిస్తారు. ఇందుకోసం బంగారం, వెండి వాడతారు. చాలా ప్రత్యేకంగా, ఎంతో శ్రమతో, నైపుణ్యంగా చేసే ఈ కళాఖండాలకు మంచి పేరు ఉంది. ఈ అపురూ కళాఖండాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.






బహుమతిగా నాగాలాండ్ శాలువా 


నాగాలాండ్ కు ప్రత్యేకమైనవి నాగా శాలువాలు. నాగాలాండ్ రాష్ట్రంలోని గిరిజనులు ఈ శాలువాలను తయారు చేస్తారు. అద్భుతమైన వస్త్ర కళకు ప్రతిరూపం ఈ శాలువాలు. శక్తివంతమైన రంగులు, క్లిష్టమైన డిజైన్లతో చూడముచ్చటగా, చూడగానే ఆకట్టుకునేలా, అద్భుతంగా ఉంటాయి. తరతరాల నుంచి వస్తున్న ఈ శాలువల తయారీని ఇప్పటికీ నాగాలాండ్ గిరిజనులు కొనసాగిస్తూ వస్తున్నారు. కాలక్రమంలో మరింత క్లిష్టమైన, సొగసైన, ఆకట్టుకునే రంగులు వాడుతున్నారు. ఈ శాలువాలకు అంతర్జాతీయంగా మంచి పేరు ఉంది. ఈ నాగాలాండ్ శాలువాలు మోదీ దక్షిణాఫ్రికా ప్రథమ మహిళ త్షెపో మోట్సెపేకి బహుమతిగా అందించారు.






బ్రెజిల్ అధ్యక్షుడికి గోండ్ పెయింటింగ్స్


బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గోండ్ పెయింటింగ్స్ ను బహుమతిగా అందించారు. గిరిజన కళారూపాల్లో గోండ్ పెయింటింగ్స్ ఒకటి. గోండ్ అనే పదం ద్రావి పదం కోండ్ నుంచి వచ్చిందని చెబుతారు. కోండ్ అంటే ఆకుపచ్చ పర్వతం.చుక్కలు, గీతలతో రూపొందించే ఈ పెయింటింగ్స్.. గోండ్ ల గోడలు, ఇళ్లపై చిత్రీకరిస్తారు. స్థానికంగా లభించే సహజసిద్ధమైన రంగులతో వీటిని చూడ ముచ్చటగా తీర్చి దిద్దుతారు. మట్టి, మొక్కల రసం, ఆకులు, ఆవు పేడ, సున్నపు రాయి పొడి మొదలైన వాటిని వాడి ఈ రంగులను తయారు చేస్తారు.