Rahul Sipligunj: తన పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలపై ప్రముఖ టాలీవుడ్ సింగర్,  ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాట పాడిన  రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. మరో మూడు నెలలలో జరగాల్సి ఉన్న  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో  కాంగ్రెస్ పార్టీ తరఫున  సిప్లిగంజ్ పోటీ చేయనున్నాడని.. గోషామహల్ నియోజకవర్గం నుంచి   పోటీ చేస్తాడని వస్తున్న వార్తలపై అతడు క్లారిటీ ఇచ్చాడు.  తన రాజకీయ అరంగేంట్రంపై వస్తున్నవన్నీ వదంతులేనని,  అవన్నీ ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చాడు.  ‘నేను ఎన్నికలలో పోటీ చేయట్లేదు. అవన్నీ  ఫేక్ న్యూస్’ అని ట్విటర్ వేదికగా  రాసుకొచ్చాడు. 


రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం నుంచి   పోటీ చేయనున్నాడని, ఈ మేరకు అతడు  టికెట్ కోసం గాంధీభవన్‌లో దరఖాస్తు కూడా చేసుకున్నాడని గుసగుసలు వినిపించాయి. గడిచిన రెండ్రోజులుగా దీనిపై పలు  యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పలు టీవీ ఛానెళ్లు కూడా ఈ వార్తలను ప్రసారం చేశాయి. పాతబస్తీకి చెందిన సిప్లిగంజ్‌కు  స్థానికంగా మంచి క్రేజ్  ఉంది. యూట్యూబ్‌లో అతడు పాడిన పాటలతో విశేష ప్రజాధరణ పొందిన  సిప్లిగంజ్ ‘నాటు నాటు’ పాటతో విశ్వవ్యాప్తమయ్యాడు. అతడి క్రేజ్ ఉపయోగించుకునేందుకు రాజకీయ పార్టీలు కూడా   రాహుల్ ఇంటికి క్యూకట్టాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ క‌ూడా గోషామహల్ టికెట్‌ను అతడికే కేటాయించనుందన్న పుకార్లు వినిపించాయి. తాజాగా సిప్లిగంజ్ దీనిపై ట్విటర్ వేదికగా  క్లారిటీ ఇచ్చాడు. 


‘అందరికీ నమస్కారం. గత కొన్నిరోజులుగా నేను  రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు, గోషామహల్  నియోజకవర్గం నుంచి  ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు వస్తున్నవార్తలన్నీ ఫేక్ న్యూస్. నేను రాజకీయాల్లోకి రావడం లేదు.  నేను అన్ని రాజకీయ పార్టీలతో పాటు నాయకులనూ గౌరవిస్తాను..’ అని స్పష్టం చేశాడు. 


 






తాను కళాకారుడినని,  ప్రజలను ఎంటర్‌టైన్ చేయడమే తనకు తెలుసునని సిప్లిగంజ్ పేర్కొన్నాడు. ‘నేను ఆర్టిస్ట్‌ను. నాకు ప్రజలను ఎంటర్‌టైన్ చేయడమే తెలుసు. నేను దీనిని నా భవిష్యత్‌లో  కూడా కొనసాగిస్తాను. నేను రాజకీయాల్లోకి వస్తానని పలు యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌లో వస్తున్న వార్తలు ఎలా వచ్చాయో నాకైతే తెలియదు.  నా దృష్టి మ్యూజిక్ కెరీర్ మీదే ఉంది. రాజకీయాలలోకి రావాలని గానీ నేను వస్తానని గానీ ఏ పార్టీనీ, రాజకీయ నాయకుడిని గానీ సంప్రదించలేదు. అలాగే ఏ పార్టీ కూడా నన్ను వాళ్లతో చేరమని అడగలేదు.  దయచేసి ఇలాంటి పుకార్లను ఇకనైనా ఆపండి..’ అని ట్విటర్ వేదికగా  రాసుకొచ్చాడు. 


ఇదిలాఉండగా కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోయే  అభ్యర్థుల కోసం దరఖాస్తు విధానాన్ని  తీసుకొచ్చిన విషయం తెలిసిందే.  శుక్రవారం చివరిరోజు కావడంతో 119 స్థానాలకు గాను  సుమారు వెయ్యికి పైగానే దరఖాస్తులు వచ్చినట్టు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దరఖాస్తులను కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ కాచి వడబోయనున్నది. వీటిలో అభ్యర్థుల పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించనున్నది. కాంగ్రెస్ పార్టీలో చేరికల జాతర సాగుతుండటంతో కొద్దిరోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తిచేసి  మొత్తం 119 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు గాను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు. 




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial