బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి 45 రోజులపాటు చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజులపాటు నిర్వహించనున్న “బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ” కార్యక్రమంపై నేతలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నేతలకు చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు. రాబోయే రోజుల్లో “బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారెంటీ” కార్యక్రమాన్ని మరిన్ని ఎక్కువ రోజులకు పొడిగించే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
“బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారెంటీ”.. ఎలా
భవిష్యత్‌కు గ్యారంటీ పేరుతో తలపెట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీంతో ఈ కార్యక్రమం మరింత దూకుడుగా నిర్వహించాలని నిర్ణయించారు. తద్వార ప్రజల్లో పార్టీని మరింత బలంగా తీసుకువెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు దేశం పాలన సమయంలో ఉన్న పరిస్థితులను ప్రజలకు వివరించటం ద్వార రాబోయే రోజుల్లో భవిష్యత్‌కు గ్యారంటీ అనే భరోసా కల్పించేందుకు పని చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్దితులు, ప్రజల జీవన విధానం, పెరిగిన ధరలు, ఉపాధి అవకాశాలు, వంటి పరిస్థితులపై కూడా ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పార్టీలో నాయకులు అంటున్నారు.
రాబోయే తరాలకు వారి జీవన విధానానికి, విద్య ఉపాధి అవకాశాలు వంటి అంశాలను కూడా టచ్ చేయనున్నారు. ఇలా భవిష్యత్ తరాలకు గ్యాంటీగా తమ పాలన ఉంటుందనే నమ్మకం కల్పించేందుకు ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు.
ఇకపై ఫుల్ స్పీడ్...
ఇప్పటికే తెలుగు దేశం పార్టీ నారా లోకేష్ ఆధ్వర్యాన యువ గళం పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అధినేత చంద్రబాబు భవిష్యత్ గ్యారంటీ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఇటీవల ప్రాజెక్ట్‌ల యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ పరిస్దితులు, రైతులకు సాగునీటి కష్టాలు, వంటి అంశాలపై పర్యటించిన చంద్రబాబు ఇప్పడు ఎకంగా 45 రోజులపాటు బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారంటీ అంటూ కార్యక్రమానికి రోడ్ మ్యాప్ రెడీ చేశారు. దీని వలన పార్టీని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచటంతోపాటుగా క్యాడర్‌కు అధినేత దగ్గరగా వెళ్ళటం, అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండకట్టి, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే విషయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎన్నికలకు మరో 8నెలల సమయం మాత్రమే ఉండటంతో వ్యూహత్మక కార్యక్రమాల పై చంద్రబాబు దృష్టి సారించినట్లుగా పార్టీ నాయకులు చెబుతున్నారు.