ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం వేడుక్కుతోంది. టికెట్‌ దక్కని వారు, ఉన్న పార్టీల్లో ప్రాధాన్యత లేదనుకున్నవారు... పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత బీఆర్‌ఎస్‌ అసంతృప్తులు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తుంగా... బీజేపీలో అభ్యర్థుల ప్రకటన ముందే జంపింగ్‌లు మొదలయ్యాయి.


పెద్దపల్లి మాజీ పార్లమెంట్‌ సభ్యుడు గడ్డం వివేక్‌ వెంకటస్వామి మరోసారి పార్టీ మారనున్నారని సమాచారం. ఈనెల 30వ తేదీ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మాజీమంత్రి జి.వెంకటస్వామి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో వచ్చిన వివేక... 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. 2014లో కాంగ్రెస్‌ తరపున పోటీచేసి ఓడిపోయాక బీఆర్‌ఎస్‌లో చేరి ప్రభుత్వ సలహాదారుగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమి కోసం ప్రయత్నించారన్న విమర్శలతో పార్టీ ఆయన్ని పక్కనబెట్టింది.


బీఆర్‌ఎస్‌లో ప్రాధాన్యత లేదని వివేక్‌ బీజేపీలో చేరారు. అయితే, ఐదేళ్లుగా బీజేపీలో ఉన్నా సరైన ప్రాధాన్యం దక్కలేదన్న ఆవేదనతో తిరిగి... కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వివేక్‌. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి సీటు ఇస్తామన్న కాంగ్రెస్‌ నుంచి ఆయనకు హామీ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వివేక్‌ వెంకటస్వామి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నారని సమాచారం. వివేక్‌ చేరితే.. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో పార్టీ బలోపేతం అవుతుందని, ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు ఆయన సహకరిస్తారని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.