అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు దక్కని నేతలకు గులాబీ బాస్ బుజ్జగిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో  ఏడుగురు మాత్రమే సీట్లు నిరాకరించారు సీఎం కేసీఆర్. 115 మందితో కూడిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. 95 శాతం కంటే ఎక్కువ సిట్టింగులకే తిరిగి సీట్లు కేటాయించారు. టికెట్ దక్కని అసమ్మతి నేతలను దారికిలోకి తెచ్చుకునేందుకు.... నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టేందుకు రెడీ అయ్యారు. కచ్చితంగా సీటు వస్తుందన్న నమ్మకంతో...పలువురు నేతలు సామాజిక సేవా కార్యక్రమాలతో పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. టికెట్లు రాకపోవడంతో...పలు నియోజకవర్గాల్లో నేతలు లోలోపల రగిలిపోతున్నారు. కొందరు బాహాటంగానే అసమ్మతిరాగాలు వినిపిస్తున్నారు.  అభ్యర్థులను మార్చాల్సిందేనని... లేదంటే ఎన్నికల్లో సహకరించే ప్రసక్తి లేదని కుండబద్దలు కొడుతున్నారు. 


ఉప్పల్, బోథ్, స్టేషన్ ఘన్ పూర్, వేములవాడ, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోకపోతే....అసెంబ్లీ ఎన్నికల్లో కష్టాలు తప్పవని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. టికెట్ దక్కని నేతలకు...గౌరవప్రదమైన పదవులు కట్టబెట్టాలని నిర్ణయానికి వచ్చారు. తాండూర్ టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఇవ్వడంతో...ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేంద్ రెడ్డి రగిలిపోతున్నారు. దీంతో ఆయన్ను మంత్రి వర్గంలో తీసుకున్నారు. గనుల శాఖను కేటాయించారు. 


వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు...ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. కేబినెట్ హోదాతో సమానమైన ఈ పదవిలో... రమేష్ బాబు ఐదేళ్ల కాలం పాటు కొనసాగనున్నారు. చెన్నమనేని రమేశ్ బాబు జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక హంబోల్ట్ యునివర్సిటీ నుంచి అగ్రికల్చర్ ఎకనామిక్స్ లో పరిశోధనలు చేసి హీహెచ్‌డీ సాధించారు. పరిశోధనా విద్యార్థిగా, ప్రొఫెసర్‌గా రమేష్ బాబుకు అగ్రికల్చర్ ఎకానమీ అంశం పట్ల ఉన్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధికోసం వినియోగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 


బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవటంతో.. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు ఘన్ పూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య. ఆరు నూరైనా, నూరు నుటయాభై అయినా...తాను మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. పైన దేవుడున్నాడని.. దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నారని అన్నారు. రేపోమాపో తాను అనుకున్న కార్యక్రమం జరుగనుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే తానున్నానని.. ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని చెప్పుకొచ్చారు. దీంతో రాజయ్యకు కూడా నామినేటెడ్ పోస్టు కట్టబెడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు,  వైరా శాసనసభ్యులు రాములు నాయక్ లకు కేబినెట్ హోదాతో సమానమైన పదవులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.