తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లా సీనియర్‌ నాయకుడు. రాజకీయ పయనం ఎటువైపు? ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని జిల్లా ప్రజలు స్పష్టం చేసిన తుమ్మల... ఏ పార్టీ నుంచి అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆయన నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటన్నది ఆసక్తిగా మారింది.


సీఎం కేసీఆర్‌ పాలేరు టికెట్‌ను తుమ్మలకు కాకుండా... కందాల ఉపేందర్‌రెడ్డికి ఇచ్చారు. అప్పటి నుంచి తన అసంతృప్తిని బయటపెడుతూనే ఉన్నారు తుమ్మల. ఆయన్ను బుజ్జగించేందుకు బీఆర్‌ఎస్‌ అధిష్టానం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది. కేసీఆర్‌ ఆదేశాలతో ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు హైదరాబాదులో తుమ్మల ఇంటికి వెళ్లి... ఆయనకు సర్ది చెప్పాలని చూశారు. అయినా తుమ్మల అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. తుమ్మలకు టికెట్‌ రాకపోవడంతో... ఆయన వర్గీయులు కూడా ఆవేదన చెందుతున్నారు. 


నిన్న హైదరాబాద్‌ నుంచి ఖమ్మం వెళ్లారు తుమ్మల. ఖమ్మం వచ్చిన తమ నేతకు నాయకన్‌గూడెం దగ్గర ఘనస్వాగతం పలికారు ఆయన అనుచరులు. వెయ్యి కార్లు, 2వేల బైక్‌లతో భారీ ర్యాలీ చేశారు. ఆ ర్యాలీ బలప్రదర్శనను తలపించింది. తుమ్మలకు తామున్నామంటూ అభిమానులు, కార్యకర్తలు అండగా నిలిచారు. తుమ్మల తన ఇంటి వరకు సాగిన ఈ ర్యాలీలో... ఆయన ఓపెన్‌ టాప్‌ వాహనంలో నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఈ ర్యాలీలో ఎక్కడా బీఆర్‌ఎస్‌ జెండాలు గానీ, కేసీఆర్‌ ఫొటోలు గానీ కనిపించలేదు. కొంత మంది కార్యకర్తలు తుమ్మల జెండాలతో పాటు కాంగ్రెస్‌ జెండాలు పట్టుకోవడం చర్చకు తెరలేపింది.


ప్రజలు, అభిమానుల ఆదరణ చూసి కొంత భావోద్వాగానికి గురైయ్యారు తుమ్మల. ఖమ్మం జిల్లా ప్రజల ప్రజల కోసం వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. తనకు రాజకీయాలు అవసరం లేకపోయినా... ప్రజల కోసం కచ్చితంగా రాజకీయాల్లో ఉంటానని ప్రకటించారు. ఈ విషయంలో తలవంచేది లేదని... తగ్గేది అంతకన్నా లేదని చెప్పారు. కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు తుమ్మల ఎన్నికల్లో బరిలో నిలవడం ఖాయమని.. ఆయన తనయుడు తుమ్మల యుగంధర్ కూడా స్పష్టం చేశారు. అంతేకాదు... వారం, పది రోజుల్లో రాజకీయంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్పారు. బీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడంతో.. తుమ్మల ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తకరంగా మారింది. 


ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పిన తుమ్మల... ఏ పార్టీలో చేరుతారనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తుమ్మల పార్టీ మారుతారా..? పార్టీ మారితే ఏ పార్టీలోకి వెళ్తారు..? లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా..? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, తుమ్మల పార్టీ మారాలని.. కాంగ్రెస్‌లోనే చేరాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. తుమ్మల ఈసారి ఎలాగైనా పాలేరు నుంచి పోటీ చేయాలని వారు పట్టుబడుతున్నట్టు సమాచారం. దీంతో తుమ్మల నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. తుమ్మల... కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని నిన్న రేణుకాచౌదరి చెప్పారు. మరోవైపు బీజేపీ కూడా తుమ్మలను తమ పార్టీలో చేర్చుకోవాలని చూస్తోంది.