YCP making mistakes which should not be done on political ground: ప్రజాస్వామ్య రాజకీయాల్లో రాజకీయ పార్టీలకు మనుగడ ఉండాలంటే ప్రధానంగా చేయాల్సిన పని ఎన్నికల్లో పాల్గొనడం, అసెంబ్లీకి హాజరవడం. ఈ రెండు రాజ్యాంగ పరంగా ఎంతో కీలకం. అయితే ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఈ రెండింటిని లైట్ తీసుకుంటోంది. నేరుగా సాధారణ ఎన్నికల్లో పోటీ పడితే చాలని .. అసెంబ్లీకి వెల్లకపోయినా ఏమీ కాదని అనుకుంటోంది. ఈ పార్టీ ఇటీవల తీసుకున్న రెండు నిర్ణయాలతో రాజకీయవర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. వ్యూహాత్మకంగా ఘోర తప్పిదాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయం - ఐదేళ్లూ వెళ్లరా ?
తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీకి రానని జగన్ అంటున్నారు. ఆయన మాత్రమే కాదు.. మిగిలిన పది మంది ఎమ్మెల్యేలను కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లేందుకు అనుమతించరు. అంటే చట్టసభలను ఆయన పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్ణయం ప్రకారం చూస్తే వచ్చే ఐదేళ్ల పాటు ఆయన కానీ ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ ముఖం చూడరు. ఎమ్మెల్యేల ప్రధాన విధి అసెంబ్లీకి హాజరయి ప్రజా సమస్యలను లేవనెత్తడం. మీడియా ముందు మాట్లాడితే లెక్కలోకి రాదు.దానికి ఎమ్మెల్యే కావాల్సిన పని లేదు. అయితే అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతా వేటు వేయడానికి అవకాశం ఉంది. కనీసం మూడు సెషన్లు హాజరు కాకపోతే .. అనుమతి కూడా అడగకపోతే స్పీకర్ అనర్హతా వేటు వేయవచ్చు.
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరం
మరో వైపు అత్యంత కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. నాలుగు జిల్లాల పరిధిలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని జగన్ నిర్ణయించుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీచర్ ఎమ్మెల్సీల్లోనూ పోటీ చేసేవారు. ప్రతిపక్షంలోకి రాగానే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించకోవడం ఆత్మహత్యాసదృశంగా బావిస్తున్నారు. ఈ నిర్ణయం పార్టీకి ఏ మాత్రం మేలు చేయదని సీనియర్లు భావిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడే పట్టభద్రులు ఓటేయలేదని ఇప్పుడు వేసే అవకాశం లేదని అందుకే పోటీకి దూరంగా ఉండటమే మేలని అనుకుంటున్నారు.
అసెంబ్లీకి వైఎస్ఆర్‌సీపీ దూరం - మీడియా ముందే ప్రసంగాలు - బాధ్యతల నుంచి పారిపోయినట్లే !?
స్థానిక ఎన్నికల్లో పోటీ చేయగలరా ?
ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఎలా పోటీ చేయగలదన్న సందేహం వస్తుంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎలా నిర్వహించారో చూసిన టీడీపీ.. అంత కంటే గొప్పగా నర్వహిస్తుందనడంలో సందేహం లేదు. మరి వైసీపీ ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయదా అన్న ప్రశ్న ఇప్పటి నుంచే వస్తోంది. ఓ రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉటుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం.. స్థానిక ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు నిర్ణయాలు వైసీపీ భవిష్యత్ ప్రణాళికలు, సన్నద్దదపై గట్టి ప్రభావం చూపుతాయని అంటున్నారు.